జనవరిలో.. మూసీ ఫేజ్-1 పనులు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:30 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రక్రియలో కీలక అడుగు పడనుంది. ఫేజ్-1 పనులను జనవరిలో మొదలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1
హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ
ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 11.8 కి.మీ. మేర నిర్మాణం
మీరాలం చెరువు పనులు 2028 నాటికి పూర్తి
సీఎం రేవంత్‌రెడ్డికి వివరించిన అధికారులు
గండిపేట వద్ద గోశాల నిర్మాణం మార్చి నాటికి..
ఎస్టీపీల నిర్మాణాలు వేగవంతం చేయాలి: రేవంత్
మూసీ పునరుజ్జీవం, రేడియల్
రోడ్ల పురోగతిపై సీఎం సమీక్ష
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రక్రియలో కీలక అడుగు పడనుంది. ఫేజ్-1 పనులను జనవరిలో మొదలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు మీరాలం చెరువు అభివృద్ధి, గండిపేట వద్ద ఆధునిక గోశాల నిర్మాణం, కోహెడ వద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ సహా అన్ని కీలక నిర్మాణాలపైనా అధికారులు లక్ష్యం విధించుకుని పనులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. జనవరిలో మూసీ ఫేజ్-1 పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
ఫేజ్-1లో.. హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్లను జోన్-1 ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1 బీగా విభజించి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఫేజ్-1లో ఒక భాగం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇక మీరాలం చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీయగా.. 2028 జనవరి నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. కాగా, చెరువు అభివృద్ధితోపాటు చెరువులో ఎంతోకాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని అధికారులు సీఎంకు వివరించగా.. ఆయా పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల్లోనూ మరింత వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. మార్కెట్ అభివృద్ధి పనులతో సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు.
ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ డిపోలు..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. వాటికి ఆయన పలు సూచనలు చేశారు. ఫుట్ బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) ఫేజ్-1కు సంబంధించి టెక్నో ఎకానమీ ఫీజబిలిటీని అధికారులు సీఎంకు వివరించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు అలైన్‌మెంట్ సాధ్యాసాధ్యాలను తెలిపారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి బషీర్‌బాగ్, సెక్రటేరియట్ మీదుగా రాణిగంజ్ వరకు అలైన్‌మెంట్ ప్రతిపాదనలను కూడా సీఎంకు వివరించారు.
అయితే నెక్లె్‌సరోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. డిపో పరిసరాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ అవకాశం ఉండేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పురోగతిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎంకు వివరించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఎస్టీపీల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News