Share News

మెట్రో రెండో దశకు లైన్‌క్లియర్‌!

ABN , Publish Date - May 01 , 2026 | 08:42 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ మహా నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణకు లైన్‌ క్లియర్‌ అయింది.

మెట్రో రెండో దశకు లైన్‌క్లియర్‌!
Hyderabad Metro

  • ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టు తొలిదశ స్వాధీనంతో తొలగిన అడ్డంకులు

  • చకచకా ముందుకు సాగుతున్న తెలంగాణ సర్కారు

  • 8 కారిడార్ల డీపీఆర్‌లకు ఆమోదం తీసుకొచ్చేందుకు ప్రయత్నం

  • రూ.43,848 కోట్ల వ్యయంతో 162.5 కిలోమీటర్లకు ప్రతిపాదన

హైదరాబాద్‌ సిటీ: కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ మహా నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకున్న తరుణంలో సెకండ్‌ ఫేజ్‌ కారిడార్ల డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లకు త్వరలో ఆమోదం లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం వద్ద మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

- విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ ప్రజా రవాణాలో మెట్రో అతికీలకంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. ట్రాఫిక్‌ రహితంగా, వేగవంతంగా నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మెట్రో మాకు కావాలంటే మాకు కావాలని గ్రేటర్‌వాసులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, నార్త్‌సిటీలో మెట్రో సౌకర్యం కల్పించాలని అక్కడి ప్రజలు ఏకంగా మేడ్చల్‌ మెట్రో సాధన సమితి పేరుతో కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.


162.5 కిలోమీటర్లు.. రూ.43,848 కోట్లు

మహానగరంలో మెట్రో రెండో దశ విస్తరణను నలుమూలలా చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పార్ట్‌-ఏ కింద నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు (36.8) కిలోమీటర్లు ప్రతిపాదించారు. అలాగే రాయదుర్గ్‌-కోకాపేట్‌ వరకు (11.6 కిలోమీటర్లు), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు), మియాపూర్‌ -పటాన్‌చెరు వరకు (13.4 కిలోమీటర్లు), ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌ వరకు (7.1 కిలోమీటర్లు) ప్రతిపాదించారు. కాగా, పార్ట్‌-బీ కింద శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు-భారత్‌ ఫ్యూచర్‌సిటీ వరకు (39.6 కిలోమీటర్లు), జేబీఎస్-మేడ్చల్‌ వరకు (24.5 కిలోమీటర్లు), జేబీ ఎస్‌ - శామీర్‌పేట్‌ వరకు (22 కిలోమీటర్లు) చేపట్టాలని నిర్ణయించారు.


ఈ క్రమంలో పార్ట్‌-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కిలోమీటర్లకు రూ.24,269 కోట్లు, పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన 3 కారిడార్లలోని 86.1 కిలోమీటర్లకు రూ.19,579 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొత్తం ప్రాజెక్టును 50:50 జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్ట్‌-ఏకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం 2024 నవంబర్‌ 4న, పార్ట్‌-బీలోని మూడు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా 2025 జూలైలో ఢిల్లీకి పంపించారు.


స్వాధీనంతో తొలగిన అడ్డంకి

రెండో దశలో ప్రతిపాదించిన కారిడార్లన్నీ దాదాపుగా మొదటి దశకు అనుసంధానంగానే ఉన్నాయి. దీంతో సెకండ్‌ ఫేజ్‌కు అనుమతి ఇస్తే, మొదటి దశతో కలిపి రైళ్ల నిర్వహణ ఎలా చేపడుతారు, టికెట్‌ షేరింగ్‌ ఎలా ఉంటుంది, నెట్‌వర్క్‌ వ్యవస్థల పరిస్థితి ఏమిటీ.. అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఒకే గొడుగు కింద ప్రాజెక్టు పూర్తిగా ఉంటే రవాణా సమస్యలు ఉండవని, ఈ విషయంపై స్పష్టత ఇస్తే రెండో దశకు అనుమతి ఇస్తామని చెబుతూ వచ్చింది. ఇదే సమయంలో నష్టాల భారంతో సతమతమవుతున్న తాము మెట్రో నిర్వహణ నుంచి తప్పుకుంటామని ఎల్‌అండ్‌టీ చెప్పడంతో ఆ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.


city3.2.jpgఈ మేరకు రూ.15వేల కోట్లతో (బ్యాంకు రుణాలు, ఎల్‌అండ్‌టీ ఈక్విటీ) ప్రాజెక్టును పూర్తిగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి కొనసాగుతున్న బదిలీ ప్రక్రియకు బుధవారం తెరపడింది. ఈ మేరకు షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)పై ఇటు ప్రభుత్వం, అటు ఎల్‌అండ్‌టీ సంతకాలు చేశాయి. దీంతో ప్రభుత్వం అధీనంలోకి మెట్రో పూర్తిగా వచ్చింది. శుక్రవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆపరేషన్స్‌ జరుగనున్నాయి. రెండో దశ విస్తరణకు అడ్డంకిగా ఉన్న మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం కొనుగోలు చేయడంతో ప్రభుత్వ పరమైంది.


మొదటగా పాతబస్తీ, ఎయిర్‌పోర్టు పనులు..

కేంద్రం నుంచి రెండో దశలోని 8 కారిడార్లకు అనుమతి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదటి దశ ప్రాజెక్టు తమ చేతిలోకి రావడంతో సెకండ్‌ ఫేజ్‌ విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే తొలుత పాతబస్తీ, నాగోల్‌- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఓల్డ్‌సిటీలో ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్లలో మొత్తం 880 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 80 శాతం భూసేకరణ చేశారు. మిగతా 20 శాతాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో నాగోల్‌-ఎయిర్‌పోర్టు పనులను కూడా మొదలు పెట్టాలని ఆలోచిస్తోంది. ఏది ఏమైనా ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లడంతో రెండో దశ అనుమతులకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.


రెండో దశ ప్రతిపాదిత కారిడార్లు

మార్గం - కిలోమీటర్లు

నాగోల్‌-ఎయిర్‌పోర్టు (కారిడార్‌-4) 36.8

రాయదుర్గ్‌-కోకాపేట్‌ (కారిడార్‌-5) 11.6

ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(కారిడార్‌-6) 7.5

మియాపూర్‌-పటాన్‌చెరు (కారిడార్‌-7) 13.4

ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ (కారిడార్‌-8) 7.1

ఎయిర్‌పోర్టు-ఫోర్త్‌ సిటీ (కారిడార్‌-9) 39.6

జేబీఎస్‌- మేడ్చల్‌ (కారిడార్‌-10) 24.5

జేబీఎ్‌స-శామీర్‌పేట్‌ (కారిడార్‌-11) 22.0


ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 08:42 AM