వారి వల్లే ఈ ఓటమి.. రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - May 01 , 2026 | 07:42 AM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న(గురువారం) జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. శుభ్‌మన్ గిల్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి తమపై ఒత్తిడి పెంచాడని, అయినప్పటికీ తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు.
'ఈ పిచ్‌పై మేం చేసిన పరుగులు ఏ మాత్రం సరిపోవు. కానీ మా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను 16వ ఓవర్ వరకు తీసుకెళ్లడం సానుకూల సంకేతం. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరించింది. మరోవైపు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో ఆడిన తీరు అద్భుతం. అతను మాపై ఒత్తిడి పెంచాడు' అని పాటిదార్ వెల్లడించాడు.
'మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను మేం సరిచేసుకోవాలి. భువనేశ్వర్ కుమార్ ఎంతో అనుభవం కలిగిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్. తొలి భాగంలో అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. టోర్నమెంట్‌లో గట్టి పోటీలో ఉన్నప్పటికీ, మేము పాయింట్ల పట్టికపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. మేం ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాం. మంచి క్రికెట్ ఆడటమే మా టార్గెట్' అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం గుజరాత్ టైటాన్స్15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 43), జోస్ బట్లర్(19 బంతుల్లో 39*), రాహుల్ తెవాటియా(17 బంతుల్లో 27*) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసి... గుజరాత్ బ్యాటర్లను కాసేపు భయపెట్టాడు. అలానే రొమారియో షెఫర్డ్ 2, సుయాశ్ శర్మ ఒక వికెట్ సాధించారు.
ఇవి కూడా చదవండి: