మెట్రో రుణం.. మళ్లీ మొదటికి!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:43 AM
ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు రూ.13,600 కోట్ల రుణం కావాలి. ఆ రుణంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి.
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యలతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌లో కలవరం
ఐఆర్‌ఎఫ్‌సీ రుణం గురించి తనకు తెలియదన్న అశ్వినీ వైష్ణవ్
మే 25న ఒప్పందం.. 6 నెలలైనా విడుదలకాని 13,600 కోట్లు
డిసెంబరు 31తోముగియనున్న ఎల్‌అండ్‌టీ గడువు
హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు రూ.13,600 కోట్ల రుణం కావాలి. ఆ రుణంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రావాల్సిన ఈ రుణం గురించి తనకేమీ తెలియదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో అన్నారు. మెట్రో రెండో దశకు ఆర్థిక సాయం తన శాఖ పరిధిలోకి రాదని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అధికారులను కలవరపాటుకు గురిచేశాయి. ఐఆర్‌ఎ్‌ఫసీ రైల్వే శాఖ ఆధీనంలోని సంస్థే. మే 25న ఆ సంస్థతో రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. అయితే కేంద్రంనుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) రాకపోవడంతో ఆరు నెలలైనా రుణం విడుదల కాలేదు. ఇదే రుణం కోసం జూన్ 22న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వైష్ణవ్‌ను కలిశారు. ఇప్పుడు ఆ రుణం గురించి తనకు తెలియదని మంత్రి అనడం గమనార్హం.
పీఎఫ్‌సీపై ఆశలు!
కేంద్రం ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ద్వారా రూ.13,600 కోట్ల రుణం ఇప్పించాలని మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులను కోరినట్లు తెలిసింది. బ్యాంకుల్లో ఆశించిన వడ్డీకి రుణం దొరకని పక్షంలో పీఎఫ్‌సీ నుంచి ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా కేంద్ర మంత్రులను అడిగినట్లు సమాచారం. పీఎఫ్‌సీ కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని సంస్థ. పీఎఫ్‌సీ కూడా వెనక్కి తగ్గితే పరిస్థితి ఏమిటని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
3 శాతానికి వడ్డీ కష్టమే..!
మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే రెండో దశకు అనుమతులు ఇస్తామని కేం ద్రం స్పష్టం చేసింది. ఎల్‌అండ్‌టీ తన వాటా విక్ర య గడువును డిసెంబరు 31వరకు పొడిగించింది. ఈ రెండు కారణాలతో డిసెంబరును లక్ష్యంగా పెట్టుకుని అధికారులు పనిచేస్తున్నారు. ఎల్‌అండ్‌టీ పేరిట ఉన్న రూ.13,600 కోట్ల అప్పును తమ పేరిట బదిలీ చేయించుకుని కిస్తీల్లో చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్విటీకి చెల్లించాల్సిన సుమారు రూ.1,460 కోట్లను హెచ్‌ఎండీఏ ద్వారా ఇవ్వనుంది. రుణ సమీకరణకు కన్సల్టెంట్‌గా నియమించిన ఎస్‌బీఐ క్యాప్స్ ద్వారా సుమారు 3 శాతం వడ్డీకి రుణం తేవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ప్రైవేటు బ్యాంకుల్లో కనీస వడ్డీ 5 శాతానికి పైగానే ఉండటంతో నిరాశే ఎదురవుతున్నట్లు తెలిసింది. దీంతో 3-4 శాతం వడ్డీకి రుణాలిచ్చే అంతర్జాతీయ బ్యాంకులతో సంప్రదింపు లు జరపాలని ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారులు మంగళవారం సూచించినట్లు సమాచారం. జపాన్ ఆర్థిక సంస్థల వైపు కూడా ప్రభుత్వం చూస్తోంది.
రెండో దశపై ప్రభావం
రెండో దశలో ఏడు కారిడార్లలో దాదాపు 122 కి.మీ. మెట్రో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని వ్యయం రూ.38,595 కోట్లని అంచనా. ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది. గడువులోగా రుణం సమకూరకపోతే మొదటి దశ టేకోవర్ మళ్లీ వాయిదా పడుతుంది. అలా జరిగితే రెండో దశ కూడా మరింత దూరమవుతుంది. అధిక వడ్డీకి రుణం తీసుకుంటే ఆ భారం రాష్ట్రంపైనే పడుతుంది.
ఓల్డ్‌సిటీ భూసేకరణ పూర్తిచేయాలి..!
రెండో దశలోని ఓల్డ్‌సిటీ కారిడార్ భూసేకరణ రెండేళ్లుగా సాగుతోంది. ఈ జాప్యంపై ప్రభుత్వం హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులను మందలించినట్లు తెలిసింది. నిధులు ఉన్నా భూసేకరణ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించినట్లు సమాచారం. డిసెంబరు రెండో వారంలోగా ప్రక్రియ పూర్తి చేసి, కారిడార్ మార్గాన్ని సివిల్ పనులకు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News