Share News

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్థలాలు ఎన్ని?

ABN , Publish Date - Aug 21 , 2026 | 08:30 AM

22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్థలాలు ఎన్ని?
Hyderabad land survey

  • నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని?

  • లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి!

  • 22ఏ సెక్షన్‌ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు

  • సబ్‌ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన

  • జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా

హైదరాబాద్‌ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్‌ ఆఫీసుల్లో సబ్‌ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్‌ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు.


అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి..

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్‌ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్‌ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


city2.jpgనివేదిక ఇచ్చేందుకు హడావుడి

వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో మండలాల వారీగా అసలు కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి.. వాటి ప్రస్తుత పరిస్థితిని తెలియజేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో కొందరు హడావుడి పడుతున్నారు. కోర్టులకు వెళ్లకపోవడంతో సమగ్ర సమాచారం లేకపోవడంతో పరేషాన్‌ అవుతున్నారు.


city2.2.jpgసబ్‌ రిజిస్ట్రార్లతో సంప్రదింపులు

22ఏపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో జిల్లాలోని తహసీల్దార్లు.. తమ పరిధిలోని సబ్‌ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నింటినీ తిరస్కరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని, సరిగా ఉన్న వాటికి బై నంబర్లు ఇస్తామని, అప్పటివరకు ఓపిక పట్టాలని కోరుతున్నారు. ఇదే సమయంలో రోజవారీ ప్రక్రియను కూడా తెలుసుకుని కలెక్టర్‌కు నివేదిక అందజేస్తున్నారు. మొత్తంగా 22ఏపై జిల్లా రెవెన్యూ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


హైదరాబాద్‌లో 3,288.16 ఎకరాలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 3,288.16 ఎకరాల అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) భూములు ఉన్నాయి. అలాగే సుమారు 15 వేల ఎకరాల్లో దేవాదాయ, వక్ఫ్‌ భూములు 7వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. ఆయా భూముల పక్కన ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే కొద్ది నెలల క్రితం జరిగిన భూసవరణ ప్రక్రియలో 22ఏ కింద ఉన్న అసైన్డ్‌, 22బీ కింద ఉన్న స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌, 22సీ కింద ఉండే దేవాదాయ/ వక్ఫ్‌బోర్డు, 22డీ కింద ఉండే అగ్రికల్చర్‌/అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, 22ఈ కింద ఉన్న కోర్టు కేసు పక్కన ఉన్న పట్టా భూముల్లో కొన్ని నిషేధిత జాబితాలో పడడంతో సమస్య మొదలైంది.


ఇదిలా ఉండగా, బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ మొత్తం కూడా 22ఏ ప్రొహిబిటెడ్‌ లిస్టులో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఓ మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఉండడంతో ఆయన విషయాన్ని ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లాంటి ప్రాంతాలతో పాటు ఇతర చోట్ల 22ఏ పక్కన ఉన్న పట్టాభూముల లెక్కలు తేల్చాలని సర్కారు ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు పరుగులు పెడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 08:30 AM