Share News

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:37 AM

తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్య సేవలు, క్యాన్సర్‌ వ్యాధి నివారణకు అమలుచేస్తున్న అత్యాధునిక విధానాలు అభినందనీయమని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కొనియాడింది.

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

  • రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసలు

  • టీ-డయాగ్నోస్టిక్స్‌, పాలియేటివ్‌ కేర్‌ ఆదర్శంగా ఉన్నాయని కితాబు

  • ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలతో సమావేశం

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్య సేవలు, క్యాన్సర్‌ వ్యాధి నివారణకు అమలుచేస్తున్న అత్యాధునిక విధానాలు అభినందనీయమని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కొనియాడింది. ముఖ్యంగా నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని చేరువ చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే టీ-డయాగ్నోస్టిక్స్‌, దీర్ఘకాలిక రోగులకు సాంత్వన చేకూరుస్తున్న పాలియేటివ్‌ కేర్‌ నెట్‌వర్క్‌ పనితీరుపై కమిటీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజారోగ్య వ్యవస్థల సమర్థత, మౌలిక వసతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ గురువారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జాతీయ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.


క్యాన్సర్‌ వైద్య సేవలపై సంతృప్తి

రాష్ట్రంలో అమలువుతున్న క్యాన్సర్‌ కేర్‌ మోడల్‌పై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు నిర్వహిస్తున్న స్ర్కీనింగ్‌ పరీక్షల నుంచి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా అందిస్తున్న అత్యాధునిక రేడియేషన్‌, సర్జికల్‌, కీమోథెరపీ సేవలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు జిల్లా, మండల స్థాయిల్లోనే ేసవలందించే పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాల నిర్వహణపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఆరోగ్యశ్రీ పథకం ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తోందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థల ప్రతినిధులు తమ సరికొత్త పరిశోధనల వివరాలను కమిటీ ముందుంచారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు స్థానికంగానే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్‌ నివారణ మాలిక్యూల్స్‌, యాక్టివ్‌ ఫార్మాష్యూటికల్‌ ఇంగ్రిడియంట్స్‌ (ఏపీఐ) గురించి వివరించారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ కణాల జన్యుపరమైన మార్పులు, మాలిక్యులర్‌ డయాగ్నోసిస్‌, టార్గెటెడ్‌ థెరపీకి సంబంధించిన ప్రయోగాలను వివరించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్‌, శాస్త్రవేత్తలు పోషకాహార లోపాల నివారణ, జీవనశైలి మార్పులతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణపై తాము చేపడుతున్న పరిశోధనలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఎండీసీ, ఎన్టీపీసీ, భెల్‌, హెచ్‌ఏఎల్‌ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) నిధులను ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతానికి ఏ విధంగా అనుసంధానిస్తున్నారో కమిటీ సమీక్షించింది. ఆయుష్మాన్‌ భారత్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని కమిటీ సూచించింది.


టిమ్స్‌, బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనుల పురోగతిపై ఆరా

హైదరాబాద్‌ నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రుల నిర్మాణాలపై కమిటీ ప్రత్యేకంగా ఆరా తీసింది. సనత్‌నగర్‌లో ప్రారంభమైన టిమ్స్‌ ఆస్పత్రి సేవల తీరును అడిగి తెలుసుకోవడంతో పాటు ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌ల నిర్మాణ పనుల పురోగతిని కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో (ఎన్జీవోలు) జరిగిన ప్రత్యేక భేటీలో అంతర్జాతీయ వైద్య పరిశోధనలు, విదేశీ భాగస్వామ్యాల ద్వారా వస్తున్న నూతన వైద్య సాంకేతికతపై చర్చించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌ యాదవ్‌ నేతృత్వంలోని 31 మంది సభ్యుల కమిటీలో (10 మంది రాజ్యసభ, 21 మంది లోక్‌సభ) 21 మంది ఎంపీలు ఈ పర్యటనకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు డాక్టర్‌ కడియం కావ్య, డాక్టర్‌ బి.పార్థసారథిరెడ్డి సమావేశంలో క్రియాశీలకంగా పాల్గొని క్షేత్రస్థాయి అంశాలను ఇతర సభ్యులకు వివరించారు.

Updated Date - Aug 21 , 2026 | 06:38 AM