దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:12 AM
దక్షిణ భారత రాష్ట్రాలు జలవివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచించారు. దేశ ప్రగతికి ఈ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలన్నారు. ఈ రాష్ట్రాల ప్రగతి నీటిపైనే...
వీటి ప్రగతి నీటిపైనే ఆధారపడింది: అమిత్‌షా
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిందే
అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్ల తరబడి
నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి
నీరు సముద్రంలోకి పోతే ఎవరికి లాభం?
జలవివాదాలను పరిష్కరించుకోండి
దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో
కేంద్ర హోం మంత్రి పిలుపు
నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి
‘కాళేశ్వరం, పాలమూరు’లకు సహకరించండి
ఆ 19 గ్రామాలను తిరిగి తెలంగాణకివ్వండి
నదుల దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం
కలగకుండా చూడండి: భట్టి, తుమ్మల
చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత రాష్ట్రాలు జలవివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచించారు. దేశ ప్రగతికి ఈ రాష్ట్రాలే ప్రధాన స్తంభాలన్నారు. ఈ రాష్ట్రాల ప్రగతి నీటిపైనే ఆధారపడి ఉందని చెప్పారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఒకరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదు. అయితే రాష్ట్రాలు ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కొంటుండగా.. ఆ నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే ఎవరికీ ప్రయోజనం చేకూరదు’ అని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి, హోం శాఖలు, అంతర్రాష్ట్ర మండలి, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో జరిగే సంయుక్త సమావేశాల ద్వారా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలను త్వరిగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘ఉత్తర భారతదేశంలో నదీ జలాల పంపిణీకి సంబంధించిన 8 సమస్యల్లో ఐదు బ్రిటిష్ పూర్వకాలం నుంచే కొనసాగుతున్నాయి. ఐదు నెలల క్రితం వీటిపై తుది ఒప్పందం కుదిరింది. బ్రహ్మపుత్ర నుంచి గోదావరి, కావేరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా.. రాబోయే వందేళ్ల పాటు దేశం నీటి కొరతను ఎదుర్కొనకుండా చూడవచ్చు. ఈ చొరవ బహుళ జలమార్గాల ఏర్పాటుకు కూడా దోహదపడుతుంది. ఇంధనం ఆదా అవడమే కాకుండా పర్యావరణం మెరుగుపడుతుంది. అంతేగాక తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థ కూడా ఏర్పడుతుంది’ అని తెలిపారు. ఐటీ, ఆటోమొబైల్స్, ఔషధ తయారీ, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో దక్షిణ భారతం కీలకపాత్ర పోషిస్తోందని.. అందుకే భారీ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఈ ప్రాంతానికి వచ్చాయని అమిత్‌షా ప్రశంసించారు. ‘దక్షిణాది అభివృద్ధి ప్రస్థానం ప్రధానంగా మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. అవి.. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సముద్ర వనరుల వినియోగంలో సాంకేతిక నైపుణ్యం. ఆవిష్కరణలు, ఆదాయ వనరుల పెంపుదలలో దక్షిణాది ప్రజలు, ఇక్కడి ప్రభుత్వాలు ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. ఈ రెండు అంశాల్లో భారతదేశం మొత్తం దక్షిణ భారతం నుంచి స్ఫూర్తి పొందాలి’ అని చెప్పారు.
విభజన సమస్యల పరిష్కారానికి అంగీకారం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన విషయాలను కేంద్ర హోం శాఖతో సంప్రదించి పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాలూ అంగీకరించాయని అమిత్‌షా చెప్పారు. ‘మహిళలు, పిల్లలపై అత్యాచార కేసుల వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు అమలు ద్వారా అత్యాచారం, పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించడం వంటివి చాలా సున్నితమైన అంశాలు. వీటిని సీఎంల స్థాయిలో అత్యంత సున్నితత్వంతో చూడాల్సిన అవసరముంది. పోషకాహార లోపంపై మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మాదకద్రవ్య రహితభారతం తక్షణావసరం. అన్ని ప్రభుత్వాలు, శాఖలు ఈ ఉద్యమంలో భాగస్వాములైతే తప్ప.. రాబోయే తరాలను ఈ దుష్ప్రభావం నుంచి కాపాడలేం’ అని తేల్చిచెప్పారు. సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు సి.జోసెఫ్ విజయ్, చంద్రబాబు, డీకే శివకుమార్, వీడీ సతీశన్, తెలంంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నీట్ నుంచి మినహాయించాలి: విజయ్
దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచారు. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) నుండి తమ రాష్ట్రాన్ని మినహాయించాలన్నారు. ఈ ప్రవేశ పరీక్ష వల్ల గ్రామీణ, నిరుపేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తమిళనాడులో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో 12వ తరగతి (ప్లస్ టూ) మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యమూ దెబ్బతినని విధంగా చట్టం తేవాలని కేంద్రాన్ని కోరారు. జనాభా స్థిరీకరణలో విజయం సాధించిన రాష్ట్రాలను దెబ్బతీయరాదన్నారు. జాతీయ లక్ష్యాలను నెరవేర్చిన రాష్ట్రాలను శిక్షించే విధానాలు పనికిరావు. మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెడుతూ తెచ్చిన చట్టంపై ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళన సముచితమేనన్నారు.
543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్: డీకే
లోక్‌సభలో ఇప్పుడున్న 543 స్థానాల్లోనే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆ మేరకు కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యేక తీర్మానం ఆమోదించాలని దక్షిణ ప్రాంతీయ మండలికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా గౌరవించాలని, వచ్చే 25 ఏళ్ల పాటు లోక్‌సభలోని ప్రస్తుత 543 సీట్లనే కొనసాగించాలని సూచించారు.
కావేరి సమస్యపై చంద్రబాబు సూచన
దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి వచ్చే ముందు ఏపీ సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని శివకుమార్ తెలిపారు. కర్ణాటక, తమిళనాడు కావేరి జలవివాదాన్ని పరిష్కరించుకోవలసి అవసరముందని ఆయన చెప్పారు. ‘కర్ణాటక ప్రతిపాదిస్తున్న మెకెదాటు ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కా తమిళనాడు-పుదుచ్చేరిలోని రైతులకు కూడా ఉపయోగపడుతుందని హామీ ఇస్తున్నా. మెకెదాటు ఆనకట్టలో నీటిని నిల్వచేస్తే కర్ణాటక, తమిళనాడుకు అవసరమైనప్పుడల్లా నీరు విడుదల చేయడానికి వీలుంటుంది. జల వివాదాలను సమష్టిగా పరిష్కరించుకోవాలి. కృష్ణానదీ జలాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల కర్ణాటకలో కృష్టా జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం’అని తెలిపారు.
దక్షిణాది ప్రగతికి కలిసి అడుగులేద్దాం: ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే దేశాభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయన్నారు. ఏపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందన్నారు. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్లు, తమిళనాడు 2.6, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని.. సమష్టిగా దక్షిణ భారత రాష్ట్రాలన్నీ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వివరించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సదరన్ జోనల్ కౌన్సిల్ పనిచేయాన్నారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు