బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:02 PM
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో బంతితో జడేజా ప్రభావం తగ్గిందని, అతడి పాత్రలో మార్పు వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో బంతితో జడేజా ప్రభావం తగ్గిందని, అతడి పాత్రలో మార్పు వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో మానవ్ సుతార్ 10 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా 4 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ అనంతరం అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జడేజా-సుతార్ పూర్తిగా భిన్నమైన బౌలర్ల అని పేర్కొన్నాడు.
‘జడేజా, సుతార్ పూర్తిగా భిన్నమైన బౌలర్లు. సుతార్ బలం అతడి చేతి నుంచి బంతి వచ్చే విధానంలో ఉంటుంది. జడేజా మాత్రం వికెట్లను లక్ష్యంగా చేసుకుని తన స్టాక్ బాల్స్‌తో నియంత్రణ సాధిస్తాడు. అయితే ఇటీవలి కాలంలో బంతితో జడేజా ప్రభావం తగ్గింది. ఇప్పుడు అతడు అటాకింగ్ స్పిన్నర్ కాదు. బంతితో అనుభవాన్ని అందించే బ్యాటర్‌గా అతడి పాత్ర మారింది. ఇది చెడ్డ విషయం కాదు. మరోవైపు మానవ్ సుతార్ తొలి రెండు టెస్టుల్లోనే వికెట్లు తీయగల సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఏం చేయబోతున్నారో అంచనా వేసి అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం సుతార్ ప్రత్యేకత. వికెట్లు తీయడానికి బంతి చేతి నుంచి ఎలా వస్తుందన్నదే ముఖ్యం కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తారు, ఫీల్డింగ్‌ను ఎలా ఏర్పాటు చేస్తారు అనేదే కీలకం. తొలి రెండు టెస్టుల్లో సుతార్ తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించాడు. భారత స్పిన్ బౌలింగ్ భవిష్యత్తుకు అతడు చాలా ముఖ్యమైన ఆటగాడు’ అని అశ్విన్ అన్నాడు.
అద్భుతంగా ఆడారు..
గాలే టెస్టులో భారత జట్టు ప్రదర్శనను కూడా అశ్విన్ ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 450కిపైగా పరుగులు చేసినప్పుడే శ్రీలంకకు మ్యాచ్ కష్టంగా మారిందని చెప్పాడు. అయితే యువ శ్రీలంక జట్టు మంచి పోరాటం చేసిందని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మానవ్ సుతార్ అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు.. మానవ్ సుతార్‌కు పుజారా సూచన
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ