నీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:52 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు..
కాళేశ్వరం, పాలమూరు కు సహకరించండి.. భద్రాచలం పరిసరాల్లోని 19 గ్రామాలను తెలంగాణకివ్వండి
విభజన చట్టంలోని 9వ షెడ్యూలు సంస్థల సమస్యను పరిష్కరించాలి
‘దక్షిణ ప్రాంతీయ మండలి’ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
హైదరాబాద్/ఖమ్మం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు, నక్కలగండి ప్రాజెక్టు పనులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూలు-9లో గల 23 కార్పొరేషన్లపై ఇప్పటికే తన అభిప్రాయాలు, డిమాండ్లను కేంద్ర హోం శాఖకు సమర్పించామని, వీటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరింది. 10వ షెడ్యూలులోని సంస్థలను విభజించాలన్న ఆంధ్రప్రదేశ్ డిమాండ్లకు విభజన చట్టంలో స్పష్టమైన ఆధారం ఏదీ లేదని పేర్కొంది. దక్షిణ ప్రాంతీయ మండలి (ఎస్‌జడ్‌సీ) 31వ సమావేశంలో భట్టి మాట్లాడుతూ నదుల దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాలని, కృష్ణా నది పరీవాహకంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సూత్రాన్ని వర్తింపజేయాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌మధ్య కృష్ణా జలాల కేటాయింపు సమస్యకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా త్వరగా పరిష్కారం కనుగొనాలని విన్నవించారు. పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడి.. కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరారు. కాళేశ్వరంలోని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కూడా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని షెడ్యూలు-9లో గల 23 కార్పొరేషన్ల విభజనపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాలను కేంద్ర హోంశాఖకు ఇప్పటికే సమర్పించిందని గుర్తుచేశారు. షెడ్యూలు-10లోని సంస్థలను విభజించాలన్న ఏపీ డిమాండ్ న్యాయసమ్మతం కాదని స్పష్టంచేశారు. ఎస్‌జడ్‌సీ 32వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని అమిత్‌షాను కోరారు.
5పంచాయతీలను మాకు ఇవ్వండి
భద్రాచలం పరిసరాల్లోని 19 రెవెన్యూ గ్రామాలతో కూడిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని అమిత్‌షాను, ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. యటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కొత్తగూడెం జిల్లా కేంద్రం 40కిలోమీటర్ల దూరంలోనే ఉందని గుర్తుచేశారు. భద్రాచలం ఆలయం తెలంగాణలో ఉండగా, ఆలయానికి సంబంధించిన భూము ల్లో చాలావరకు ఏపీలో ఉండటం వల్ల ఆలయ పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ అంశంపై అమిత్‌షా జోక్యం చేసుకోవాలని కోరారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను వెంటనే అందించాలని కోరారు. ఆయిల్‌పామ్ గెలల టన్నుకు కనీసం రూ.25,000 ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బాబుకు విన్నవించారు. భద్రాచలం నుంచి ఏపీలోని ఏలూరు వరకు ఉన్న రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించి, నిధులు మంజూరు చేసేలా చొరవ చూపాలని కోరారు.