అమెరికా అప్పులు.. 3,896 లక్షల కోట్లు
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:38 AM
అగ్రరాజ్యం అమెరికా అప్పుల్లోనూ తన రికార్డులను తానే బద్దలుకొడుతోంది.. ఈ నెల 19 నాటికి అమెరికా అప్పులు ఏకంగా రూ.3,896 లక్షల కోట్ల (40.7 ట్రిలియన్ డాలర్ల)కు చేరాయి...
ఐదు నెలల్లోనే రూ.163 లక్షల కోట్ల రుణాలు
వాషింగ్టన్, ఆగస్టు 20: అగ్రరాజ్యం అమెరికా అప్పుల్లోనూ తన రికార్డులను తానే బద్దలుకొడుతోంది.. ఈ నెల 19 నాటికి అమెరికా అప్పులు ఏకంగా రూ.3,896 లక్షల కోట్ల (40.7 ట్రిలియన్ డాలర్ల)కు చేరాయి. ఈ ఏడాది మార్చిలో అమెరికా అప్పు రూ.3,733 లక్షల కోట్లు (39 బిలియన్ డాలర్లు)కాగా.. కేవలం ఐదు నెలల్లోనే సుమారు మరో రూ.163 లక్షల కోట్లు (1.7ట్రిలియన్ డాలర్లు) అప్పులు చేయడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధంతో రక్షణ వ్యయం భారీగా పెరగడం, సంక్షేమ కార్యక్రమాల కోసం చెల్లింపులు, రుణాలపై వడ్డీల చెల్లింపుల కోసం రుణసేకరణ పెరిగిందని అమెరికా ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక అమెరికా రుణాలు పెరుగుతున్నా.. అవి జీడీపీ-రుణ నిష్పత్తికి లోబడే ఉన్నాయని శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయంలో వృధాను, దుర్వినియోగాన్ని, మోసాన్ని అరికట్టే దిశగా ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపడుతోందని చెప్పారు. అయితే పెరుగుతున్న రుణాల కారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగి.. సాధారణ ప్రజలపై, వ్యాపారాలపై ప్రభావం పడుతోందని బైపార్టిసాన్ పాలసీ సెంటర్ సీఈవో మార్గరెట్ హెచ్చరించారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా రుణభారంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు