Share News

బెంబేలెత్తిన ఐటీ కారిడార్‌..

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:11 AM

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, హైటెక్‌ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్‌డౌన్‌ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

బెంబేలెత్తిన ఐటీ కారిడార్‌..
Hyderabad, IT Corridor, Traffic

  • గచ్చిబౌలిలో ఒక్క వాహనం బ్రేక్‌డౌన్‌

  • కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

  • ఎండలో ఇబ్బందులు పడిన వాహనదారులు

  • ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు గంటల తరబడి శ్రమించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, హైటెక్‌ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్‌డౌన్‌ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. తాజాగా బుధవారం నార్సింగి, నానక్‌రామ్‌గూడ వైపు నుంచి గచ్చిబౌలికి వచ్చే మార్గంలో ఓ ఎస్‌యూవీ కారు కారు ఆకస్మికంగా రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ఘటనతో ఓఆర్‌ఆర్‌ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తున్న వేలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండతున్న ఎండల్లో కార్లు, బైక్‌లపై ప్రయాణిస్తున్న వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా చేరుకోగా, మరికొందరు ముఖ్యమైన సమావేశాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు కిలోమీటరు పైగా బారులు తీరగా, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి పోలీసులకు గంటన్నరకు పైగా సమయం పట్టింది.


నిత్యకృత్యంగా మారిన బ్రేక్‌డౌన్‌లు..

గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాలు నగరానికి ఐటీ హబ్‌గా మారిన తర్వాత ఇక్కడ వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. నగరం నలుమూలల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వచ్చి వెళుతుంటారు. దీంతో ఇక్కడి రోడ్లపై వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వాహనాలు బ్రేక్‌డౌన్‌ కావడం ట్రాఫిక్‌జామ్‌కు దారి తీస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి జంక్షన్‌, ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌ రోడ్‌) వైపు, మసీద్‌బండా, ఐకియా ఫ్లైఓవర్‌, హైటెక్‌సిటీ మెయిన్‌ రోడ్‌ వంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.


city5.2.jpgఐటీ ఉద్యోగుల హైబ్రిడ్‌ వర్క్‌ కారణంగా మంగళ, బుధ, గురు వారాల్లో రద్దీ మరింత పెరుగుతోంది. ఒక్క గంటలోనే 10వేలకు పైగా సింగిల్‌ రైడర్‌ వెహికిల్స్‌ రోడ్డు మీదకు వస్తున్నాయని ఇటీవల మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా రద్దీ సమయాల్లో బ్రేక్‌డౌన్‌ అయిన వాహనాన్ని పక్కకు తీయడానికి ట్రాఫిక్‌ పోలీసులు గంటల తరబడి శ్రమించాల్సి వస్తోంది. మరోవైపు ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేయడం పోలీసులకు మరో సవాల్‌గా మారింది. ఈ పరిస్థితులపై ఐటీ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


రోజూ కార్యాలయాలకు చేరుకోవడానికి గంటల సమయం పడుతోందని, ట్రాఫిక్‌లోనే విలువైన సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. వాహనాల తొలగింపుకు ఫాస్ట్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ ఏర్పాటు చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయడం, ట్రాఫిక్‌ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయడం అవసరమని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి పండుగ వచ్చేస్తోంది!

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2026 | 11:11 AM