కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:21 AM
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ నష్ట పరిహారాన్ని అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు.
మంత్రాలయంలో కొలువుదీరిన శ్రీరాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు కర్ణాటక వాసులు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ వాహనం ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలికలు ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరు వాసులని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ సిరి
కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ సిరి పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడి.. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందిన నలుగురు క్షతగాత్రులు డిశార్చ్ అయ్యారన్నారు. మిగిలిన వారు.. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరణ..
మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. బొలెరో వాహనం డ్రైవరు నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.
దిగ్భ్రాంతికి లోనయ్యాను: డిప్యూటీ సీఎం
మంత్రాలయం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రాలయం క్షేత్రం దర్శనం కోసం వస్తున్న కర్ణాటకకు చెందిన భక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. కర్ణాటకలోని ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబాలకు తగిన సహాయం చేయాలని కూడా సూచించామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశం
ఈ దుర్ఘటనలో కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బొలెరో వాహనం రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ గుర్తిస్తాం: మంత్రి టీజీ భరత్
మంత్రాలయం జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి మున్ముందు ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రకటించారు. కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించినట్లు మంత్రి భరత్ గుప్తా తెలిపారు.
రోడ్డు ప్రమాదం.. బాధాకరం: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
కర్నూలు రోడ్డు ప్రమాదం బాధాకరమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బొలెరో వాహనం - ట్యాంకర్ ఢీ కొన్న ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అత్యంత విచారకరం: హోం మంత్రి అనిత
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందడం అత్యంత విచారకరమన్నారు. ట్యాంకర్‌ను బొలెరో వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కందుకూరి వీరేశలింగం పంతులుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
For More AP News And Telugu News