Share News

దాటవేత.. మౌనం.. యాగీ!

ABN , Publish Date - Apr 16 , 2026 | 06:09 AM

దేవదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణి, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) శాంతి.. ఏసీబీ అధికారుల విచారణకు సహకరించలేదని తెలిసింది.

దాటవేత.. మౌనం.. యాగీ!

  • విచారణకు సహకరించని శాంతి

  • ఏసీబీ అధికారుల ప్రశ్నలకు మౌనం

  • దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అక్రమాస్తుల వ్యవహారంపై మరింత దృష్టి

అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణి, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) శాంతి.. ఏసీబీ అధికారుల విచారణకు సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మహిళా డీఎస్పీ, మరో సీఐ బుధవారం ఆమెను సుదీర్ఘంగా విచారించారు. 50కి పైగా ప్రశ్నలు సంధిస్తే వాటిలో 20కి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని, మౌనంగా ఉండిపోయారని తెలిసింది. విశాఖపట్నంలో ఫ్లాటు తన భర్త బహుమతిగా ఇచ్చారని చెప్పిన ఆమె.. తాడేపల్లిలో ఖరీదైన బంగళాను ఎలా సంపాదించారన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారని సమాచారం. ఏసీబీ అధికారులు పదే పదే ప్రశ్నించడంతో ‘‘నాకు చిన్న బాబు ఉన్నాడు.. వాడితో మాట్లాడాలి..’’ అంటూ యాగీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ సర్వీసులో చేరిన నాలుగేళ్లలోనే విశాఖపట్నం, తాడేపల్లిలో స్థిరాస్తులు సంపాదించిన ఆమెపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఇటీవలే అరెస్టు చేశారు. విజయవాడ జైల్లో ఉన్న ఆమెను కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుని బుధవారం గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. విజయవాడ వన్‌టౌన్‌లోని యూనియన్‌ బ్యాంకు లాకర్‌లో ఉన్న బంగారాన్ని ఆమె సమక్షంలో తెరిచి అందులో బంగారు నగలను సీజ్‌ చేశారు.


శాంతి 2020లో విశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ)గా ఉద్యోగంలో చేరారు. అప్పటికి ఆమె జీతం రూ.50 వేలు. ప్రొబేషన్‌ పూర్తికాకముందే.. 2021, సెప్టెంబరులో విశాఖ నగరంలోని ఎండాడలో త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. దీని ఖరీదు రూ.40 లక్షలుగా చూపించారు. దీనికి బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇక్కడి నుంచి విజయవాడ బదిలీ అయిన తర్వాత తాడేపల్లి పరిధిలో కుంచనపల్లిలోని బ్రూక్‌ఫీల్డ్‌లో జీ+2 విల్లా కొన్నారు. దాని ప్రస్తుత ధర రూ.4 కోట్లు. కానీ, రూ.90 లక్షలకే కొన్నట్టు చూపించారు. దీనిని రూ.50 లక్షలకు తాకట్టు పెట్టినట్టు పేర్కొన్నారు. రెండేళ్లలో మరో బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇంకో విల్లా కొన్నారు.

అవన్నీ అమ్మవారి వస్తువులే..

శాంతి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అనేక వెండి వస్తువులు లభించాయి. అవన్నీ తనకు బహుమతిగా వచ్చాయని, పెళ్లి కాక ముందే తాను కొన్నానని ఏసీబీ అధికారులకు ఆమె చెప్పారు. కానీ, అవన్నీ ఆమె వివిధ ఆలయాల్లో ఈవోగా పనిచేసినప్పుడు అక్కడ విరాళాలుగా వచ్చినవేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన చీరలు సైతం ఆమె కార్లో వేసుకొని తీసుకుపోయేవారనే ఆరోపణలున్నాయి. శాంతి తన భర్తగా పేర్కొన్న న్యాయవాది పోతిరెడ్డి సుభాశ్‌ గురించి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

వైసీపీ నేతల అండ..

రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో 2020లో చేరిన కలింగిరి శాంతి విశాఖపట్నంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి సహా వైసీపీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఆమె విలువైన ఆలయ భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా అప్పటి అధికార పార్టీ నేతల సిఫారసులతో కట్టబెట్టారు. ప్రతిఫలంగా అనతి కాలంలోనే విశాఖలో స్థిరాస్తులు కొన్నారు. ఉన్నతాధికారిపై ఇసుకతో దాడి చేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.

Updated Date - Apr 16 , 2026 | 06:10 AM