Share News

హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం.. ఖరీదైన మద్యం బాటిల్స్‌లో చీప్ లిక్కర్ విక్రయాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:58 PM

కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఖరీదైన బ్రాండ్ల పేరుతో చీప్ లిక్కర్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం.. ఖరీదైన మద్యం బాటిల్స్‌లో చీప్ లిక్కర్ విక్రయాలు
hyderabad fake liquor racke

హైదరాబాద్, నవంబర్ 17: నగరంలో కల్తీ మద్యం కలకలం రేపింది. చీప్ లిక్కర్‌ను మిక్సింగ్ చేసి ఖరీదైన బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


పోలీసులు కథనం ప్రకారం.. శంషాబాద్‌లోని శాతంరాయి ప్రాంతంలో నివాసముండే అశోక్ అనే వ్యక్తి.. బగ్గ డిస్టిలరీలో ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేసి.. క్యాబ్ డ్రైవర్‌గా పనికి చేరాడు. అయితే.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో.. డిస్టలరీలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి.. కల్తీ మద్యం తయారీకి తెరలేపాడు. తన ఇంటి వద్దనే మద్యం తయారు చేసి.. క్యాబ్ నడుపుతూ.. మద్యాన్ని డెలివరీ చేస్తున్నాడు. కాగా.. ఈ దందాను గమనించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ధనుంజయ్ డీటీఎఫ్ అధికారులకు సమాచారం అందించగా.. ఈ వ్యవహారం బయటపడింది.


ఎక్సైజ్ అధికారులు అశోక్ ఇంటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖరీదైన మద్యం బాటిల్స్‌లో చీప్ లిక్కర్‌ నింపుతుండగా.. అశోక్‌‌ను పట్టుకున్నారు. 560 విలువైన డౌన్ టెన్ చీప్ లిక్కర్‌తో.. ఖరీదైన మద్యం బాటిల్స్‌ను నింపుతున్నట్లు వారు గుర్తించారు.

స్క్రాప్ దుకాణం నుంచి ఖాళీ ఖరీదైన మద్యం బాటిళ్ల సేకరించి.. వాటిని శుభ్రపరచి.. కల్తీ మద్యాన్ని నింపి విక్రయిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 10 ఫుల్ బాటిల్స్‌ కల్తీ మద్యాన్ని, 30 ఖాళీ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న అశోక్‌తో పాటు.. అతనికి సహకరించిన స్క్రాప్ దుకాణం యజమాని యాకూబ్ పాషాలను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 02:59 PM