అడుగంటిన భూగర్భ జలాలు
ABN , Publish Date - May 08 , 2026 | 09:36 AM
భానుడు భగ భగమంటున్నాడు. మునుపెన్నడూ లేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య పెరుగుతోంది.
ఎండిపోయిన బోర్లు
గతేడాదితో పోలిస్తే 65 శాతం పెరిగిన ట్యాంకర్‌ల డిమాండ్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జలమండలి
హైదరాబాద్: భానుడు భగ భగమంటున్నాడు. మునుపెన్నడూ లేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా జలమండలి సంజీవరెడ్డినగర్ డివిజన్‌లో 12 సబ్ డివిజన్‌ల పరిధిలో నీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా జలమండలి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదనంగా ఫిల్లింగ్ స్టేషన్‌లు, ట్యాంకర్లను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
చైనా మోటార్లతో కొత్త సమస్య
డివిజన్ పరిధిలో బస్తీల్లో బోర్ల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ శాతం మంది జలమండలి సరఫరా చేసే నీటి మీదే ఆధారపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ చైనా మోటార్లతో నీటిని తోడుతుండడం వల్ల సమస్యలు అధికమవుతున్నాయి. బోరబండ, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, బీఎస్ మక్తా, ఎంఎస్‌మక్తా, ఫిలింనగర్ లాంటి ప్రాంతాల్లో చైనా మోటార్లను స్థానికులు విరివిగా ఉపయోగిస్తున్నారు. నీరు అధికంగా వచ్చేందుకు వీరు ఈ మోటార్లను వాడుతుండటం వల్ల వీధి చివర్లో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చైనా మోటార్లను కట్టడి చేసేందుకు జలమండలి విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహిస్తున్నప్పటికి ఆశించిన ఫలితం ఉండటం లేదు. గత పదిహేను రోజుల్లో వరుసగా మూడు రోజుల పాటు నీటి సరఫరా పై నుంచి నిలిపేయడంతో బస్తీల్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. సాంకేతిక కారణాలతో నీరు ఆపేస్తారేమోనని స్థానికులు మోటార్లతో అదనంగా నీటిని లాగేసి స్టోర్ చేసుకుంటున్నారు. ఈ మోటార్ల వినియోగం వల్ల పైప్‌లైన్‌ల లీకేజీలు కూడా ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వేసవి డిమాండ్ తట్టుకునేందుకు డివిజన్ పరిధిలో గతేడాది అదనపు ఫిల్లింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ల ద్వారా వాటర్ ట్యాంకర్లు సరఫరా అవుతున్నాయి. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో ట్యాంకర్ పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే కొన్నిచోట్ల డిమాండ్ పెరిగిపోతుండటం సంపు కెపాసిటీ తగ్గిపోవడం వంట కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా అందుబాటులో ఉంచారు.
80 శాతం ఎండిపోయిన బోర్లు
డివిజన్ పరిధిలో కాలనీతో పాటు మురికివాడలు కూడా అనేకం ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్థుల భవనాల యజమానులు నీటి కోసం బోర్ల పై ఆధారపడుతున్నారు. ఏప్రిల్ చివరి వారం, మే నెలలో 50 శాతం బోర్లు ఎండిపోతుండటంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది డివిజన్ పరిధిలో ఉన్న 80 శాతం బోర్లు అడుగంటాయి. దీంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 65 శాతం ట్యాంకర్ల డిమాండ్ పెరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో డిమాండ్ మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటునప్పటికీ నీటి సరఫరా జరిగితే కాని డిమాండ్‌ను తీర్చలేమని అధికారులు పేర్కొంటున్నారు.
బ్లాక్‌లో ప్రైవేట్ ట్యాంకర్లు
సాధరణంగా జలమండలి పంపించే 5000 లీటర్ల తాగునీరు ధర రూ. 500. సాఽధారణ రోజుల్లో ఈ ట్యాంకర్ అందుబాటులో లేని సమయంలో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ద్వారా బోరు నీరు పదివేల లీటర్లు రూ. 1,500. ప్రస్తుతం అవసరాలు పెరగడంతో ప్రైవేటు ట్యాంకర్లకు కూడా గిరాకీ పెరిగింది. ట్యాంకర్ యజమానులు ఒక ట్యాంకర్ ధరను రూ. 3,500 పెంచారు. నీటి లెవెల్ తగ్గితే ఈ ట్యాంకర్ కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. సంజీవరెడ్డినగర్ డివిజన్ పరిధిలో హాస్టల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు ట్యాంకర్ల వినియోగం కూడా పెరిగింది. వర్షాకాలం, చలికాలంలో ట్యాంకర్ల మీద ఆధారపడే హాస్టల్ యజమానులు వేసవి వచ్చేసరికి ట్యాంకర్ల సంఖ్య పెంచుతుండటంతో ప్రైవేటు ఆపరేటర్లు ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదే జరిగితే.. 107 మంది రాజీనామా!
Read Latest Telangana News and National News