Share News

భార్యపై భర్త దాడి.. నడి రోడ్డుపై గొంతు కోసేందుకు యత్నం..

ABN , Publish Date - May 08 , 2026 | 08:40 AM

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పట్టపగలు నడి రోడ్డుపై భార్యను చంపేందుకు దాడి చేశాడు. ఏకంగా కత్తితో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.

భార్యపై భర్త దాడి.. నడి రోడ్డుపై గొంతు కోసేందుకు యత్నం..
Bengaluru Crime News

బెంగళూరు: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పట్టపగలు నడి రోడ్డుపై భార్యను చంపేందుకు దాడి చేశాడు. ఏకంగా కత్తితో ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో ఈ భయానక దాడి నుంచి మహిళ తృటిలో తప్పించుకుంది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బెంగళూరు శివారు దాసనపుర వద్ద రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ద్విచక్రవాహనంపై ముఖానికి మాస్క్, హెల్మెట్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. మహిళపై ఒక్కసారిగా దాడి చేస్తూ విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసేందుకు యత్నించాడు. ఈ దాడిని గమనించిన స్థానిక యువత హత్యాయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడిపై దాడి చేసి మహిళను రక్షించారు. సుమారు ఐదారుగురు యువకులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడింది. అయితే, హత్యాయత్నం చేసింది సదరు మహిళ భర్త సంజయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


బెంగళూరు శివార్లలోని నీలమంగళ ప్రాంతంలో బిహార్‌కు చెందిన భార్యాభర్తలు సంజయ్, సోనాలి నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. పెళ్లి అనంతరం వారిద్దరూ బెంగళూరుకు వచ్చారు. అయితే, కొన్నాళ్లుగా వారి మధ్య కుటుంబ కలహాలు మెుదలయ్యాయి. సంజయ్‌ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. అతనితో ఇకపై కలిసి ఉండేది లేదని సోనాలి తేల్చి చెప్పింది. దీంతో రెచ్చిపోయిన సంజయ్.. ఆమెను చంపేందుకు దాడి చేశాడు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు సోనాలి ప్రాణాలను రక్షించుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి

2,000 కి.మీ దూరం ప్రయాణించిన పావురం

విజయ్ ప్రమాణ స్వీకారం క్యాన్సిల్.. స్టేడియం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న మద్దతుదారులు

Updated Date - May 08 , 2026 | 08:47 AM