ఏపీలో ఫేక్ ప్రచారం పీక్స్!
ABN , Publish Date - May 08 , 2026 | 04:12 AM
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయ నేర గణంకాల నివేదిక (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.
వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో అగ్రస్థానం
దేశంలో 40శాతం తప్పుడు ప్రచారాలు మన రాష్ట్రంలోనే.. ఎన్‌సీఆర్‌బీ నివేదిక-2024లో కేంద్రం వెల్లడి
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు
ఎస్సీ, ఎస్టీలపైనా దాడులు తగ్గుముఖం.. సైబర్ నేరాలు, బాల నేరస్థుల సంఖ్య పెరుగుదల
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయ నేర గణంకాల నివేదిక (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబసభ్యులు, మహిళలపై వ్యక్తిగత దూషణల్లో ఏపీ హాట్ స్పాట్‌గా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహిళలు-చిన్నారులపై నేరాలు, హత్యలు, ఎస్సీ-ఎస్టీలపై దాడులు తగ్గగా.. సైబర్ నేరాలు, వృద్ధులపై దాడులు పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. 2024కు సంబంధించి దేశవ్యాప్తంగా నేరాలు, శాంతి భధ్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఎన్‌సీఆర్‌బీ గురువారం విడుదల చేసింది. సోషల్ మీడియా యుగంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 40 శాతం తప్పుడు ప్రచారాల కేసులు నమోదైనట్లు గణాంకాలతో తెలిపింది. దేశంలోని ప్రతి 10 దుష్ప్రచార (ప్రాపగాండ) కేసుల్లో నాలుగు ఏపీలోనే నమోదయ్యాయంటే ఇక్కడ సైకో మూకలు ఏ స్థాయిలో రెచ్చిపోయారో స్పష్టంగా వెల్లడవుతోంది. దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు, వదంతుల వ్యాప్తికి సంబంధించి నమోదైన కేసులు 483 కాగా.. ఒక్క ఏపీలోనే 203 కేసులు రిజిస్టర్ అవడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారాలు, నకిలీ వార్తల పోస్టులు, సృష్టించిన వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు సందేశాలు విపరీతంగా పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ వివరించింది. మరోవైపు వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా అడ్డూ అదుపు లేని వదంతులు వ్యాప్తి చేసినట్లు తెలిపింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించడం, ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేలా తప్పుడు కంటెంట్ సృష్టించి వ్యాప్తిని ఏపీ నిఘా విభాగం, సైబర్ మానిటరింగ్ సెల్ గుర్తించి, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్న విషయాన్ని వివరించింది. ఇలాంటి పరిస్థితులు ఇతర ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వంలో తగ్గిన నేరాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని కేంద్ర హోంశాఖ నివేదికలో పేర్కొంది. వైసీపీ పాలనతో పోలిస్తే నేరాలు తగ్గుముఖం పట్టాయని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, ఇతర హత్యలు తగ్గుముఖం పట్టాయని చెప్పిన నివేదిక.. బాల నేరస్తులు పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు ఆర్థిక మోసాలు తగ్గగా, సైబర్ నేరాలు పెరిగినట్లు వివరించింది. ఇక 2023తో పోలిస్తే హింసాత్మక నేరాల కేసులు 2024లో అనూహ్యంగా పెరిగాయి. ఎన్నికల ఏడాది కావడంతో చిన్న చిన్న గొడవలు జరిగినా హింసాత్మక నేరాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.