డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలతో.. ఎమ్మెల్సీకి బెదిరింపు
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:40 AM
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. ఓ ఎమ్మెల్సీపై అసభ్యకరంగా, అభ్యంతరకరంగా డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు సృష్టించారు.
సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్
ఎమ్మెల్సీని రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా
5 లక్షలకు మీర్జా రహమత్ బేగ్‌తో బేరం
ముఠా ఆటకట్టించిన నార్సింగి పోలీసులు
ఆరుగురు నిందితుల అరెస్టు
రూ.4.70 లక్షలు స్వాధీనం..
హైదరాబాద్ సిటీ/నార్సింగి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. ఓ ఎమ్మెల్సీపై అసభ్యకరంగా, అభ్యంతరకరంగా డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు సృష్టించారు. వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ ఎమ్మెల్సీని బెదిరించి రూ.5 కోట్ల డబ్బు డిమాండ్ చేశారు. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు చాకచక్యంగా ముఠా ఆటకట్టించారు. ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన కోళ్ల వ్యాపారి మహ్మద్ మొహిసిన్‌ఖాన్, ఫాతిమా బేగం, మహ్మద్ సమీర్, మహ్మద్ జమీర్, సయ్యద్ రెహాన్, బార్క్‌సకు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ ఇమ్రాన్ సహా మొత్తం 14 మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఓ పథకం రచించి.. ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను టార్గెట్ చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను సేకరించి.. వాటిని డీప్‌ఫేక్ టెక్నాలజీతో అసభ్యకరంగా మార్చారు. ఆ వీడియోలను ఎమ్మెల్సీ మొబైల్‌కు పంపించి.. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో షాక్‌కు గురైన ఎమ్మెల్సీ రహమత్ బేగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు..
వివరాలు సేకరించిన పోలీసులు.. పక్కాగా స్కెచ్ వేసి, ఎమ్మెల్సీతో కలిసి నిందితులతో మైండ్‌గేమ్ ఆడారు. పోలీసుల సూచన మేరకు నిందితుల ముఠాతో ఎమ్మెల్సీ బేరానికి దిగారు. దీంతో తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా.. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఫలానా చోటుకు వచ్చి డబ్బు తీసుకోవాలని ఎమ్మెల్సీ చెప్పడంతో.. పైన పేర్కొన్న ఆరుగురు నిందితులు గురువారం ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లి దూదిపెట్టెలో ప్యాక్ చేసిన డబ్బును తీసుకున్నారు. అక్కడి నుంచి డబ్బుతో పారిపోతుండగా.. అప్పటికే మాటువేసిన ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి 4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం 14 మంది ఉన్న ముఠాలో ఆరుగురు మాత్రమే పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ గతంలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎంఐఎం నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీని మార్ఫింగ్ వీడియాలతో బ్లాక్‌మెయిల్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఠాలో ఆయన ప్రత్యర్థులెవరైనా ఉండవచ్చా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులుఎవరు? ఎమ్మెల్సీని ఎందుకు టార్గెట్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు దొరికితే మరిన్ని విషయాలు వెల్లడవుతాయంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News