Share News

చిన్నారిని రక్షించిన సాహసవంతులకు సీపీ సజ్జనార్ సన్మానం

ABN , Publish Date - Apr 17 , 2026 | 07:29 PM

తొమ్మిదేళ్ల బాలికను కాపాడిన ముగ్గురు సామాన్య పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ప్రశంసించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న సెజల్, గణపతి, కాశీనాథ్‌లను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.

చిన్నారిని రక్షించిన సాహసవంతులకు సీపీ సజ్జనార్ సన్మానం
CP Sajjanar

హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్ల బాలికను కాపాడిన ముగ్గురు సామాన్య పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) ఐపీఎస్ ప్రశంసించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న సెజల్, గణపతి, కాశీనాథ్‌లను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.


సాహస పౌరులకు ఘన సన్మానం..

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీపీ సజ్జనార్ ఈ ముగ్గురును శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డును అందజేశారు. ‘వీరి సాహసం సమాజానికి ఒక గొప్ప సందేశమని ప్రశంసించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరులు ఇలాగే అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికట్టవచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ 'ప్రజా పోలీస్‌'గా మారాలని సీపీ సజ్జనార్ సూచించారు.


అప్రమత్తంగా ఉండాలి...

ఈ సందర్భంగా గతంలో గోల్కొండలో ఎనిమిదేళ్ల బాలికను కాపాడిన మహ్మద్ ఫిరోజ్ ఉదంతాన్ని కూడా సీపీ సజ్జనార్ గుర్తు చేశారు. ప్రజల చైతన్యమే నేర నియంత్రణలో పోలీసులకు కొండంత అండ అని అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏవైనా అనుమానాస్పద ఘటనలు లేదా నేరాలు జరుగుతున్నప్పుడు భయపడకుండా ఈ మార్గాల ద్వారా పోలీసులను సంప్రదించాలని సీపీ సజ్జనార్ సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, జూబ్లీహిల్స్ ఎస్ఐ సోమ శేఖర్ తదితరులు పాల్గొని సాహస యువతను అభినందించారు.


ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడిన యువకులు..

ఈ నెల 14వ తేదీన సెజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ - 10 సమీపంలో ఓ హృదయ విదారక దృశ్యాన్ని గమనించారు. ఓ వ్యక్తి చిన్నారితో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ బాలిక కళ్లలో కనిపించిన భయం సెజల్, గణపతిలను కదిలించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు నిందితుడిని అడ్డుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కాశీనాథ్, నారాయణలు కూడా తోడవడంతో నిందితుడు తప్పించుకోలేకపోయాడు. వెంటనే డయల్ 100కు కాల్ చేసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు.


విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు..

పోలీసుల విచారణలో నిందితుడు యూసఫ్‌గూడకు చెందిన జావీద్ అని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, ఐస్‌క్రీమ్ కొనిస్తానని ఆ చిన్నారిని బైక్‌పై తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో (POCSO) యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

SAJJANAR.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 07:43 PM