శవాల దగ్గరా ఖాకీల కక్కుర్తి!
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:15 AM
సైబరాబాద్ కమిషనరేట్ ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్టుమెంట్ వాచ్‌మన్‌గా పనిచేసే వ్యక్తి కుమార్తె ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
పోస్టుమార్టం మృతదేహాలను అప్పగించడానికి కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్
ఇన్‌స్పెక్టర్లు హెచ్చరించినా మారని తీరు
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్టుమెంట్ వాచ్‌మన్‌గా పనిచేసే వ్యక్తి కుమార్తె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించగా నాలుగు రోజులు చికిత్స పొందిన అనంతరం ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయి కానిస్టేబుల్ బాధ్యతా రాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పై అధికారుల ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. పోస్టుమార్టం నిర్వహించే వైద్యాధికారులకు డెత్ సమ్మరీ ఇచ్చినందుకు తనకు రూ. 3,500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఒకవైపు కూతురును పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని కానిస్టేబుల్ కనికరం లేకుండా డబ్బులు డిమాండ్ చేయడం పలువురిని కల చివేసింది. తమ కుమార్తె మరణించి 36 గంటలు గడుస్తున్నా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగించక పోగా.. తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాము డబ్బులు ఇచ్చుకునే స్థితిలో లేమని, కావాలంటే పై అధికారులను కలిసి బతిమాలుకుంటామని చెప్పడంతో కానిస్టేబుల్ మిన్నకుండిపోయాడు.

సిటీ కమిషనరేట్ పరిధిలో (గతంలో రాచకొండ లిమిట్స్) ఇబ్రహీంపట్నం డివిజన్ (ప్రస్తుతం ఆదిబట్ల)లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించడానికి క్షేత్రస్థాయి కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు రూ. 1500 ఫోన్ పే చేసిన తర్వాత మృతదేహాన్ని అప్పగించాడు. ఇవి మచ్చుకు ఒకటి రెండు మాత్రమే. మెజారిటీ పోలీస్ స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేసు ఏదైనా కాసులు పడాల్సిందే..
ఆత్మహత్య, మెడికో లీగల్, యాక్సిడెంట్, ఇతర ఏ కేసైనా చేతిలో కాసులు పడాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి పోలీసులు. పోలీసుల సమక్షంలో పోస్టు మార్టం జరిగే ఏ కేసైనా శవాన్ని కుటుం బాలకు అప్పగించాలంటే బాధితులు డబ్బులు చెల్లించుకోవాల్సిందే. సుమారు రూ.3వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చనిపోయారన్న బాధ, కనికరం లేకుండా కుటుంబ సభ్యుల స్థాయి, అంతస్థును బట్టి శవాల ముందే బేరం కదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
Read Latest Telangana News and National News