Share News

మద్యం ముడుపులతోనే ఎన్నికలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:39 AM

మద్యం కుంభకోణంలో వసూలు చేసిన ముడుపుల సొమ్మునే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు తేలింది.

మద్యం ముడుపులతోనే ఎన్నికలు

  • తాడేపల్లిలో డెన్‌.. లిక్కర్‌ వ్యాపారుల నుంచి వసూళ్లు

  • చెవిరెడ్డి అనుచరులకు కోట్ల రూపాయలు అందజేత

  • అక్కడి నుంచి ఎన్నికల వార్‌ రూమ్‌కు, వైసీపీ అభ్యర్థులకు

  • డెన్‌ కీపర్‌ ప్రణయ్‌ ప్రకాశ్‌ రిమాండ్‌ రిపోర్టులో సిట్‌

అమరావతి/విజయవాడ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో వసూలు చేసిన ముడుపుల సొమ్మునే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు తేలింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే తాడేపల్లిలో డెన్‌ ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ద్వారా అందజేసినట్లు బయటపడింది. లిక్కర్‌ కంపెనీల నుంచి వసూలు చేసిన నోట్ల కట్టలకు కాపలదారుగా వ్యవహరించిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ అధికారులు ఈ విషయాలు వెల్లడించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన ప్రణయ్‌ను సిట్‌ అధికారులు నేపాల్‌ సరిహద్దుల్లో సోమవారం అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడ తీసుకొచ్చారు. గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి ప్రణయ్‌ అనుచరుడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చదివిన ప్రణయ్‌.. మద్యం కంపెనీల నుంచి లిక్కర్‌ గ్యాంగ్‌ వసూలు చేసిన డబ్బును భద్రపరిచిన తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్‌ అపార్ట్‌మెంట్‌లో కాపలాదారు, నిర్వాహకుడిగా ఉండేవాడు. మద్యం వ్యాపారులు తెచ్చి ఇచ్చే డబ్బును డెన్‌లో దాచి చెవిరెడ్డి అనుచరులు బాలాజీ కుమార్‌ యాదవ్‌, ఎడ్ల నవీన్‌ కృష్ణ, గన్‌మెన్‌ గిరిబాబుకు అందజేసేవాడు. అక్కడి నుంచి చెవిరెడ్డి నిర్వహణలో ఉన్న వైసీపీ ఎన్నికల వార్‌ రూమ్‌కు, అంతిమంగా రాష్ట్రంలోని వివిధ నియోజకవరాల్లోని వైసీపీ అభ్యర్థులకు డబ్బును ఎన్నికల సమయంలో పంపారు. ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం పంపాలో ప్రణయ్‌ నిర్దేశించేవాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజ్‌ కసిరెడ్డి అనుచురుడు బూనేటి చాణుక్య అప్రమత్తమై ప్రణయ్‌ను దుబాయ్‌ పంపించేశాడు. అక్కడి నుంచి టాంజానియాకు వెళ్లి చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు కర్మాగారం స్థాపించడానికి డీపీఆర్‌ను తయారు చేశాడు.


మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేయడంతో ప్రణయ్‌ను సిట్‌ అధికారులు పిలిపించారు. న్యాయస్థానంలో వాంగ్మూలం కూడా ఇచ్చిన తర్వాత నుంచి విచారణకు గైర్హాజరయ్యాడు. సిట్‌ నుంచి తప్పించుకోవడానికి థాయ్‌లాండ్‌, టాంజానియా, జింబాబ్వే పారిపోయాడు. ఈ డెన్‌ను నిర్వహించే మరో నిందితుడు ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌కు ప్రణయ్‌ స్నేహితుడు. ఆ స్నేహంతోనే ఫీల్డ్‌ మానిటరింగ్‌ అనే ప్రాజెక్టులో కీలక ఉద్యోగిగా చేరాడు. వైసీపీ హయాంలో ప్రతి మద్యం షాపులోనూ ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం విక్రయించాలో సిబ్బందికి ఆదేశాలిచ్చేవాడు. ఎవరు ముడుపులిస్తే వారి బ్రాండ్లను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకునేవాడు. కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని ఎవరైనా చెబితే ఇచ్చింది అమ్మాల్సిందే అంటూ ఒత్తిడి చేసేవాడని రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ అధికారులు పేర్కొన్నారు.


ఎల్‌వోసీ బెదిరింపు అనుకున్నా..

ప్రణయ్‌ ప్రకాశ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించింది. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. నిందితుడి తరఫున హైకోర్టు న్యాయవాదులు సూదిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పుప్పాల రోహిణి సుధీర్‌ కుమార్‌, కొఠారి సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. రిమాండ్‌ విధించిన అనంతరం నేపాల్‌ ఎందుకు వెళ్లారని ప్రణయ్‌ను న్యాయాధికారి ప్రశ్నించారు. దుబాయ్‌లో ఉన్న తన భార్య గర్భవతని, ఆమెకు ఆరోగ్యం బాగోలేదని నిందితుడు తెలిపాడు. సిట్‌ అధికారుల విచారణకు సహకరించానని, ఒక్కసారి వెళ్లి భార్యను చూసి వస్తానని అనుమతి అడిగానని వివరించాడు. తనను బెదిరించడానికే ఎల్‌వోసీ (లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌) జారీ చేసినట్లు సిట్‌ అధికారులు చెప్పారని భావించానని చెప్పాడు.

Updated Date - Mar 06 , 2026 | 03:40 AM