ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:34 AM
తెలంగాణలో ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
అందుకే మునిసిపోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం చూస్తున్నారు: కవిత
కుటుంబంతో కలిసి శ్రీవారికి మొక్కులు
హైదరాబాద్/రేణిగుంట మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మటం లేదని అన్నారు. అందువల్లే ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోగలిగిందని తెలిపారు. కవిత గురువారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శనానికి వెళ్లారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం, అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలే ధ్యేయం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే తమ కొత్త పార్టీ ఎజెండాగా ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను అడ్డుపెట్టుకొని పేదలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తనపై అక్రమంగా లిక్కర్ కేసును పెట్టి నాలుగేళ్లు వేధింపులకు గురిచేశారని, దేవుడి దయతో నిర్దోషిగా బయటపడ్డానని తెలిపారు. కేసులో క్లీన్‌చిట్ వచ్చిన సందర్భంగా జాగృతి శ్రేణులు, తన కుటుంబంతో కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలన్న మొక్కును చెల్లిస్తున్నట్లు చెప్పారు. తాను వేంకటేశ్వర స్వామిని ఎప్పుడు దర్శించుకున్నా మంచి జరిగిందని, త్వరలో పెట్టబోయే కొత్త పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో టీటీడీ విశ్వసనీయతను పెంచేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.