నాదస్వర విద్వాంసుడు సుభానీ కన్నుమూత
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:44 AM
ప్రముఖ నాదస్వర విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ మహబూబ్ సుభానీ(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం......
చెన్నై/ ఒంగోలు కల్చరల్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ప్రముఖ నాదస్వర విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ మహబూబ్ సుభానీ(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం శ్రీరంగంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి గురువారం శ్రీరంగంలో అంత్యక్రియలు ముగిసినట్లు సన్నిహితులు తెలిపారు. మహబూబ్ సుభానీ స్వస్థలం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి. ఆయన నాదస్వర విద్వాంసుల కుటుంబంలో 8వ తరానికి చెందినవారు. దేశ, విదేశాల్లో ఆయన వందలాది కచేరీలు ఇచ్చి, శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి సుభానీ ‘కలైమామణి’ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన విద్వాంసుడిగా, శ్రీరంగం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా సేవలు అందించారు. సుభానీ 2020లో సతీమణి కాలేషాబీతో కలసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.