Share News

గుంటూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:41 AM

ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై సభలో ఎమ్మెల్యే ప్రశ్నించగా.. మంత్రి కందుల దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.

గుంటూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే
AP Assembly

అమరావతి, మార్చి 6: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) 15వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు వద్ద డిస్నీల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్న లేవనెత్తారు. డిస్నీ ల్యాండ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వినోద కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. వట్టిచెరుకూరులో జాతీయ రహదారి పక్కన అనువైన భూమి అందుబాటులో ఉందని అన్నారు. డిస్నీ ల్యాండ్ ఏర్పాటుకు అక్కడి రైతులు 500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తోందని, ఈ నేపథ్యంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు ప్రవాస భారతీయులు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు.


ఈ ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వండర్‌ లా, ఇమేజికా వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. వీరు తిరుపతిలో వినోద కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. డిస్నీ ల్యాండ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. దీనికి భారీగా ఖర్చు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క కేంద్రం ఏర్పాటుకు 30 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం డిస్నీ ల్యాండ్ మెట్రో నగరాల్లో మాత్రమే ఉందన్నారు. ఇక్కడ అంత ఖర్చుతో ఏర్పాటు చేస్తే వయబులిటీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక్కడి ప్రజలు అంత ఖర్చు పెట్టే స్థితిలో లేరని మంత్రి పేర్కొన్నారు.


పీపీపీ విధానంలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయవచ్చని మంత్రి వెల్లడించారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని.. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని తెలిపారు. కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. భాగస్వామ్య సదస్సులో 18 వేల కోట్ల రూపాయల విలువైన పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలు జరిగినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఎరువులు, వంటగ్యాస్‌కు తిప్పలే!

ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 09:52 AM