పప్పుశనగ ధరలు ఢమాల్.. రైతుల్లో ఆందోళన
ABN , Publish Date - Mar 06 , 2026 | 07:48 AM
పప్పుశనగ ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగకపోవడంతోపాటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధరలు ఢమాల్
మద్దతు ధరతో కొనుగోలులో జాప్యం
బయటి మార్కెట్‌లో విక్రయిస్తున్న రైతులు
పడిపోయిన పప్పుశనగ ధరలు
అనంతపురం అర్బన్/ ఉరవకొండ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పప్పుశనగ ధరలు (Bengal Gram Price) అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగకపోవడంతోపాటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు తప్పని పరిస్థితుల్లో ఇప్పటికే బయట మార్కెట్‌లో తక్కువ ధరకే పప్పుశనగ పంటను విక్రయించారు. మరికొందరు ధర మరింతగా పెరుగుతుందనే ఆశతో గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.
మద్దతు ధరతో కొనుగోలుపై జాప్యం
ఈ సారి రబీ సీజన్‌లో 47వేల హెక్టార్లల్లో పప్పుశనగ పంట సాగైంది. ఎకరాకు రూ.20వేల దాకా పెట్టుబడులు పెట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో సరాసరి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో 5 నుంచి 8 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. నెల రోజుల కిందటే జిల్లాలో పప్పుశనగ కోతలు పూర్తయ్యాయి. ఈ సారి పప్పుశనగ క్వింటాల్ మద్దతు ధర రూ.5875లుగా ప్రభుత్వం నిర్ణయించింది. దిగుబడుల విక్రయానికి ఫిబ్రవరి 17 నుంచి రైతు సేవా కేంద్రాల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే పప్పుశనగ కొనుగోలు చేయడంపై జాప్యం చేస్తున్నారు. జిల్లాలో ఇదివరకే ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు చేస్తున్నారు. కందుల కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పప్పుశనగ కొనుగోలు ప్రక్రియ జాప్యం జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
1145 మంది రిజిస్ట్రేషన్..
జిల్లావ్యాప్తంగా ఇప్పటి దాకా 1145 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత వారం నుంచి కూడేరు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో 104 మెట్రిక్ టన్నుల పప్పుశనగను కొనుగోలు చేశారు. తాజాగా కణేకల్లు మండల కేంద్రంలో పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిగిలిన మండలాల్లో ఇప్పటి దాకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై రైతులకు మరింత అవగాహన కల్పించడంతోపాటు మద్దతు ధరతో కొనుగోలు చేయడంపై ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది.
బయట మార్కెట్‌లో అంతంతే..
బయట మార్కెట్‌లో పప్పుశనగ ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం బయట మార్కెట్‌లో క్వింటా రూ.5వేల నుంచి రూ.5100 పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయానికి పప్పుశనగ క్వింటా ధర రూ.6వేల నుంచి రూ.6600 దాకా పలికింది. రెండేళ్ల కిందట క్వింటా ధర రూ.7వేల నుంచి రూ.7200 దాకా ఉంది. ఐదేళ్ల కిందట రూ.8వేల నుంచి రూ.10వేలు దాకా పలికింది. ఈ సారి పంట కోతలు మొదలైనప్పటికీ ధరలు మాత్రం పెరగడం లేదు. కొందరు దళారులు కుమ్మకై ధరలు పెరగకుండా కుట్రలు పన్నుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పంట చేతికొచ్చే సమయానికి...
ఈ సారి ఆరు ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశా. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. రైతులు పప్పుశనగ పంటను విక్రయించిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రయోజనం?, నెల రోజుల కిందటే పంట కోతలు పూర్తయ్యాయి. తప్పని పరిస్థితుల్లో బయట మార్కెట్‌లోనే పంటను అమ్ముకున్నా.
- రైతు ఓబన్న, గడేహోతూరు, వజ్రకరూరు మండలం
వెంటనే ప్రారంభించాలి..
పప్పుశనగ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ఈ సారి 8 ఎకరాల్లో పంట సాగుచేశా. ధరలు పడిపోవడంతో గోదాంలో నిల్వ చేసుకున్నా. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ రూ.5వేలకు అడుగుతున్నారు. మద్దతు ధరతో కొనుగోలు ప్రారంభించకపోవడంతో బయట మార్కెట్‌లోనూ ధరలు పెరగడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, వెంటనే పప్పుశనగ పంటను కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
- రైతు గాదిలింగ, గడేహోతూరు, వజ్రకరూరు మండలం
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News