Share News

ఎరువులు, వంటగ్యాస్‌కు తిప్పలే!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:24 AM

గల్ఫ్‌లో ముదురుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ సంగ్రామం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రవాసీయులు, పర్యాటకులకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు..

ఎరువులు, వంటగ్యాస్‌కు తిప్పలే!

  • యుద్ధం ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడే అవకాశం

  • గల్ఫ్‌ దేశాల నుంచే యూరియా, డీఏపీ ముడిపదార్థాల దిగుమతి

  • దాడుల నేపథ్యంలో నాఫ్తా, సహజ వాయువు ఉత్పత్తిని నిలిపివేసిన ఖతర్‌

  • స్తంభించిన జల రవాణా మార్గాలు

  • పెరిగిపోనున్న వంటగ్యాస్‌ ధరలు!

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌లో ముదురుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ సంగ్రామం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రవాసీయులు, పర్యాటకులకే పరిమితమైన ప్రభావం ఇప్పుడు.. భారతీయ పంటపొలాలకు, వంటగదులకూ విస్తరించేట్లుగా ఉంది. మన దేశ రైతులు ఉపయోగించే ఎరువుల్లో నాఫ్తా, డీఏపీ ముఖ్యమైనవి. నాఫ్తా ప్రధానంగా ఖతర్‌ నుంచి దిగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా నాఫ్తాను సరఫరా చేయలేమని ఖతర్‌ బుధవారం రాత్రి చేతులెత్తేసింది. యూరియా, డీఏపీ ఉత్పత్తికి వాడే ముడిపదార్థాలు కూడా భారత్‌కు గల్ఫ్‌ దేశాల నుంచే సరఫరా అవుతుంటాయి. యూరియాను భారత్‌లో 32ప్లాంట్లు ఉత్పత్తి చేస్తుండగా వాటిలో 30ప్లాంట్లు ఖతర్‌ సరఫరా చేసే నాఫ్తాపై ఆధారపడ్డాయి. ఖతర్‌కాకుండా ఇతర దేశాల నుంచి కొనాలంటే మూడింతలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంత ధరకు కొన్నా.. రవాణాలో నెలకొన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే. ఇక మనకు అవసరమయ్యే డీఏపీలో అత్యధికభాగం సౌదీ అరేబియాతోపాటు జోర్డాన్‌, మొరాకో దేశాలు సరఫరా చేస్తాయి. ఎరువుల ఉత్పత్తిలో వినియోగించే సల్ఫర్‌.. ఖతర్‌, ఒమాన్‌, యూఏఈల నుంచి వస్తోంది. వీటి రవాణా జరిగే అరేబియా సముద్ర మార్గం ప్రస్తుతం స్తంభించింది. యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. దీంతో రానున్న వేసవి నాట్ల నాటికి దేశంలో ఎరువులకొరత తీవ్రమై, రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.


సహజ వాయువుకూ తిప్పలే!

సహజ వాయువు ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఖతర్‌.. తమ ప్లాంట్లపై ఇరాన్‌ దాడుల కారణంగా ఉత్పత్తిను నిలిపివేసింది. ఒప్పందం చేసుకున్న దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో సహజ వాయువు సరఫరా చేయలేమని ప్రకటించడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. భారత్‌ దిగుమతి చేసుకునే సహజవాయువులో దాదాపు 40శాతం (ఏటా 2.7 కోట్ల టన్నులు) ఖతర్‌ నుంచే వస్తోంది. ఖతర్‌ తాజా ప్రకటనతో గ్యాస్‌ ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. కాగా, సహజవాయువైనా డీఏపీ, సల్ఫర్‌ వంటివైనా అరేబియా సముద్రంతోపాటు సౌదీ తీరంలోని ఎర్ర సముద్రం మీదుగా భారత్‌కు వస్తాయి. హర్మోజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. ఎర్ర సముద్రం తీరంలో హుతీల దాడులకు ఇప్పటికే నౌకాయానం దాదాపుగా నిలిచిపోయింది. భారత్‌కు సహజవాయువు రవాణా చేసే దిశ నౌక ఖతర్‌లో ఆగిపోగా.. రాహీ, అసీం అనే నౌకలు గుజరాత్‌లో నిలిచిపోయాయి. దీంతో వంటగ్యాస్‌ సరఫరా కూడా చిక్కుల్లో పడింది.

టన్నుకు వెయ్యి డాలర్లు!

యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యూరియా ధర టన్నుకు వెయ్యి డాలర్లను (రూ.91,742) మించిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టన్నుకు 850 డాలర్లున్న డీఏపీ ధర వెయ్యి డాలర్లకు చేరవచ్చంటున్నారు. డిమాండ్‌, ముడిపదార్థాల లభ్యత ఆధారంగా ఎరువుల ధరలను సరఫరాదారులు నిర్ణయిస్తుంటారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో వాటి ధరలు ఆకాశాన్నంటే సూచనలే కనిపిస్తున్నాయి. భారత ఫర్టిలైజర్‌ అసోసియేషన్‌ వివరాల ప్రకారం.. 2025-26 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో దేశంలో 3.11 కోట్ల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. దీంట్లో దేశీయ ఉత్పత్తి 2.24 కోట్ల టన్నులు కాగా.. మిగిలినది దిగుమతుల ద్వారా సమకూరినదే. 2024-25లో దిగుమతులు కొంత తగ్గటంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొంది. దీంతో దిగుమతులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Mar 06 , 2026 | 04:24 AM