తాజ్‌మహల్ తరహాలో చార్మినార్ అభివృద్ధి
ABN , Publish Date - Apr 16 , 2026 | 08:42 AM
ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు సందర్శకులు ఎలా తరలివస్తారో, అలా చార్మినార్‌కు కూడా వచ్చేలా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు సందర్శకులు ఎలా తరలివస్తారో, అలా చార్మినార్‌కు కూడా వచ్చేలా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం ఎండీ గౌతమి, పురావస్తు, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి చార్మినార్, సర్దార్ మహల్, చౌమహల్లా ప్యాలెస్, గుల్జర్ హౌస్, పత్తర్‌ఘట్టి, లాడ్ బజార్ తదితర ప్రాంతాలను పరిశీలించారు, టూరిజం ప్రమోషన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక కట్టడాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
‘రోప్ వే’పై మంత్రి ఆరా
కుతుబ్ షాహీ టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణ ప్రతిపాదనలపై పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. టూంబ్స్‌లోని ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌లో జరుగుతున్న పనులను కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం రోప్ వే పనుల గురించి చర్చించారు. గోల్కొండ కోట సమీపంలోని బస్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కటోరా హౌస్, ఖజానా బిల్డింగ్ మ్యూజియంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీజీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News