కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కారు
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:49 AM
తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కారు ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33 శాతం ఇందులో ముస్లిం బీసీలు 10.08శాతం
ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79 శాతం
ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం
భూములూ అత్యధికంగా వారి చేతిలోనే
తర్వాతి స్థానాల్లో యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు
బీసీల్లో 56 కులాల మధ్య అసమానతలు
బీసీల్లో కొన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఓసీలతో సమాన స్థాయిలో..
అన్ని కులాల్లో కులాంతర వివాహాల జోరు
కులం పేరు వెల్లడించని ఓసీలు 12 లక్షలు
కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం
వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో..
పార్లమెంటులో జర్చ జరగాలి: పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కారు ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం, జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. స్థూలంగా చూస్తే... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో 10.08 శాతం వెనకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు తెలిపింది. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. ఓసీల్లో వారు 30.47 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08 ఉండగా.. వైశ్యులు 9.07 శాతం, కమ్మవారు 6.56 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు 5.98 శాతం, వెలమలు 2.56 శాతం ఉన్నారు. కాగా, కులం పేరు వెల్లడించనివారు ఓసీల్లో 21.49 శాతం ఉండటం విశేషం. వీరు మొత్తంగా 12 లక్షల పైచిలుకు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్లు, ఇలాంటి వాటిలో అగ్రకులాల వారే ముందున్నారు. వీరిలో భూములు అత్యధికంగా రెడ్ల చేతిలో ఉన్నాయి. ఆ తరువాత వరుసగా యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరుకాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు.
56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు..
వెనుకబాటుతనం పరంగా రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు ఉన్నాయి. బీసీల్లోని కొన్ని వర్గాలైతే సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వెనుకబాటుతనం సగటుతో పోల్చితే ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నారు. కాగా, కులాంతర వివాహాలు చేసుకుంటున్నవారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు. ఈ వివరాలన్నిటినీ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం విడుదల చేశారు. ప్రజలు ఈ వివరాలను ‘డీఈఎస్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్’ నుంచి పొందవచ్చని వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయడం అసాధ్యమని గతంలో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు అయిష్టంగానైనా సిద్ధమైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున.. తెలంగాణ కులగణనపై పార్లమెంటులో చర్చ జరగాలని ఈ వివరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం తెలిపారు.
అత్యధిక జనాభా ఉన్న కులాలు
కులం - జనాభా (శాతం)
మాదిగ 36,57,551 (10.3శాతం)
ముదిరాజ్ 26,39,027 (7.4శాతం)
లంబాడీ/బంజారా 24,04,056 (6.8శాతం)
యాదవ 20,18,725 (5.7శాతం)
రెడ్డి 17,10,244 (4.8శాతం)
గౌడ 16,30,187 (4.6శాతం)
మాల 14,71,514 (4.1శాతం)
మున్నూరుకాపు 13,75,018 (3.9శాతం)
పద్మశాలి 11,82,252 (3.3శాతం)
వర్గాల వారీగా మొత్తం జనాభా
విభాగం జనాభా శాతం
ఎస్సీ 61,84,319 17.43
ఎస్టీ 37,05,929 10.45
బీసీ (ముస్లిం మినహా) 1,64,09,179 46.25
ముస్లిం మైనార్టీ (బీసీ) 35,76,588 10.08
ముస్లిం మైనార్టీ (ఓసీ) 8,80,424 2.48
ముస్లిం మైనార్టీ (మొత్తం) 44,57,012 12.56
ఓసీ (ముస్లిం మైనార్టీ) 8,80,424 2.48
ఇతర ఓసీలు 47,21,115 13.31
మొత్తం ఓసీలు 56,01,539 15.79