Share News

కేదార్‌తో రోహిత్‌రెడ్డి సోదరులకు లింకు!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:36 AM

మొయినాబాద్‌ డ్రగ్స్‌ , కాల్పుల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)..

కేదార్‌తో రోహిత్‌రెడ్డి సోదరులకు లింకు!

  • డ్రగ్స్‌ కేసులో కొత్త మలుపు

  • తెరమీదకు మృతిచెందిన నిర్మాత పేరు

  • రోహిత్‌ బ్రదర్స్‌కు కేదార్‌తో లావాదేవీలు

  • రితీశ్‌ ఖాతా నుంచి 25 లక్షలు బదిలీ

  • విచారణలో విరుద్ధ జవాబులిచ్చిన వైనం

  • కోర్టులో సిట్‌.. కస్టడీ పెంపునకు పిటిషన్‌

హైదరాబాద్‌/రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ డ్రగ్స్‌ , కాల్పుల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం).. మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డికి దుబాయి నెట్‌వర్క్‌ లింకులు ఉన్నట్లుగా బలమైన ఆధారాలను బయటపెట్టింది. రోహిత్‌ సోదరులకు దుబాయి నెట్‌వర్క్‌తో లింక్‌లతో పాటు డ్రగ్స్‌ రాకెట్‌ను నడుపుతున్నారా?అనే కోణంలో ఇటీవల ఓ ప్రత్యేక కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన సంగతి తెలిసిందే. తాజాగా పైలట్‌ రోహిత్‌ రెడ్డి తదితరులను కస్టడీ కోరిన సమయంలో పోలీసులు కీలక విషయాలను కోర్టుకు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన సిట్‌ బృందం.. రోహిత్‌ రెడ్డి, ఆయన సోదరుడి ఖాతాల నుంచి అనుమానస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలిపింది. గత ఏడాది దుబాయిలో డ్రగ్స్‌ అతిగా తీసుకోవడంతో మృతిచెందిన సినీ నిర్మాత కేదార్‌ పేరును సిట్‌ తెరమీదకు తీసుకొచ్చింది. ఆ సమయంలో రోహిత్‌ అక్కడే ఉన్నారని ఆరోపణలొచ్చాయి. తాజాగా సిట్‌ చేసిన విచారణలో కేదార్‌తో రోహిత్‌ రెడ్డి బ్రదర్స్‌కు దగ్గరి సంబంధాలున్నాయనే విషయం వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. రోహిత్‌రెడ్డి, కేదార్‌కు మధ్య అనేక లావాదేవీలున్నాయంటూ ఈ వివరాలను కోర్టు ముందుకు తెచ్చారు. రితేశ్‌ బ్యాంక్‌ ఖాతా నుండి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. కేదార్‌తో లావాదేవీల గురించి అడిగినప్పుడు రోహిత్‌, రితేశ్‌ పొంతనలేని సమాధానాలు చెప్పారని కస్టడీ పొడిగింపుు పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. రోహిత్‌ ఆర్థిక వ్యవహారాలు రితేశ్‌ చూస్తారని, డ్రగ్స్‌ పార్టీలకు డబ్బు రితేశ్‌ ఖాతా నుంచి వెళ్ళిందని, అర్జున్‌ రెడ్డి, కౌశిక్‌ రవి రితేశ్‌ బ్యాంక్‌ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అలాగే చాలామంది డ్రగ్‌ పార్టీ నిర్వాహకులకు అనేకసార్లు రోహిత్‌ సోదరులు డబ్బులు పంపినట్లు పోలీసులు ఆధారాలు ేసకరించారు.


కేదార్‌తో పాటు బేబీలాన్‌ పబ్‌కు చెందిన అర్జున్‌, కౌశిక్‌ రవిలతో కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గతంలో జరిగిన పార్టీలకు కూడా కేదార్‌ హాజరైనట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కాగా రూ. కోట్లకు పడగలెత్తిన కేదర్‌కు రోహిత్‌రెడ్డి సోదరుల నుంచి రూ. 25లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఎమైనా బిజినెస్‌ డీల్‌కు సంబంధించిన మొత్తమా? లేక డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించినదా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. కాగా మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్‌ పార్టీలు పాల్గొన్నవారు 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ 11 మందిని విచారించగా ఇప్పటి వరకు 25 మందికి పైగా పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో డ్రగ్‌ పంపిణీదారులు, విదేశీ లింకులు కలిగిన వ్యక్తులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఫామ్‌హౌ్‌సలో 2024 సెప్టెంబరు నుంచి 2026 మార్చి 14 వరకు కనీసం 8 సార్లు ఫామ్‌ హౌస్‌లో డ్రగ్‌ పార్టీలు జరిగినట్టు సిట్‌ ప్రాథమిక విచారణలో తేలింది. విచారణ సమయంలో రోహిత్‌ రెడ్డి, రితేశ్‌.. కేదార్‌తో తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పరస్పర విరుద్ధ వాంగ్మూలాలను ఇచ్చినటు పోలీసులు చెబుతున్నారు. దీంతో మరింత లోతుగా విచారించేందుకు కస్టడీ పొడిగించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 04:36 AM