Share News

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:55 AM

పార్టీ అధిష్ఠానం, శ్రేణులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడతానని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేశ్‌ అన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

  • పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడతా

  • నా మార్గదర్శి చంద్రబాబుకు ధన్యవాదాలు

  • అంజిరెడ్డి, తోట చంద్రయ్య, మంజులారెడ్డి స్ఫూర్తి

  • జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిపై లోకేశ్‌

తిరుపతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పార్టీ అధిష్ఠానం, శ్రేణులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడతానని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేశ్‌ అన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదేరోజు ఆయనను పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువలు, శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రత్యర్థులు బెదిరించినా భయపడకుండా తొడగొట్టి ఎన్నికల బరిలో నిలిచిన అంజిరెడ్డి తాత.. ప్రాణం పోతున్నా ప్రత్యర్థి పేరు తన నోట పలకని తోట చంద్రయ్య.. రక్తమోడుతున్నా పోలింగ్‌ బూత్‌లో కూర్చున్న మంజులారెడ్డి నాకు స్ఫూర్తి. అందరి త్యాగాల వల్లే 94 శాతం సీట్లతో ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చున్నాం. ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలుంటాయని పాదయాత్రలో చెప్పాను. అదే ఇప్పుడు చేస్తున్నాం. వారి లాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. అభంశుభం తెలియని అమర్నాథ్‌ గౌడ్‌, అబ్దుల్‌ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని పొట్టనపెట్టుకున్నారు.


దోషులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చునే అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వంలో క్యాడర్‌పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చాలావరకూ క్లియర్‌ చేశాం. మిగిలినవి కూడా త్వరలో విడుదల చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటాం. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి విలువ ఇస్తాం. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తనూ మై టీడీపీ యాప్‌ ద్వారా గుర్తించి సముచిత స్థానం కల్పిస్తాం. తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఒక క్లస్టర్‌ ఇన్‌చార్జిని, ఒక మండల పార్టీ అధ్యక్షురాలిని తీసుకున్నాం’’ అని లోకేశ్‌ అన్నారు.


పదవి కాదు జీవితకాల బాధ్యత: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇది కేవలం పదవి మాత్రమే కాదని, తనపై ఉంచిన జీవితకాల బాధ్యత అని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన తన మార్గదర్శి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్త నుంచి నేడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పార్టీ శ్రేణుల మద్దతు, వారి పోరాటాలు, త్యాగాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం.. పార్టీ అభ్యున్నతి కోసం.. శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 05:56 AM