Share News

ఓసీల్లో రెడ్లే ఎక్కువ!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో మొత్తంగా 20 ఓసీ (ఓపెన్‌ కేటగిరీ) కులాలు ఉన్నాయని, ఆ కులాలన్నింటిలో కలిపి 56,01,539 మంది జనాభా ఉన్నారని రాష్ట్ర సర్కారు వెల్లడించింది.

ఓసీల్లో రెడ్లే ఎక్కువ!

  • రాష్ట్రంలో ఓసీ కులాల సంఖ్య 20.. జనాభా 56,01,539

  • మొత్తం రాష్ట్ర జనాభాలో 15.79 శాతం వారే!

  • ఓసీల్లో 30 శాతం రెడ్డి కులస్తులే.. రాష్ట్రజనాభాలో 4.8ు

  • జనాభాలో వెలమలు 0.4 శాతం.. ఓసీల్లో 2.56 శాతమే

  • కులం చెప్పనివారి సంఖ్య 12 లక్షల మందికిపైనే..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొత్తంగా 20 ఓసీ (ఓపెన్‌ కేటగిరీ) కులాలు ఉన్నాయని, ఆ కులాలన్నింటిలో కలిపి 56,01,539 మంది జనాభా ఉన్నారని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. మొత్తం జనాభాలో ఓసీలు 15.79శాతంగా పేర్కొంది. ఇక ఓసీల్లో అత్యధికంగా రెడ్డి కులస్తులే ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో రెడ్ల సంఖ్య 17,06,867 మందికాగా, ఓసీల్లో వారు 30.47శాతం కావడం గమనార్హం. మొత్తం రాష్ట్ర జనాభాలో వారు 4.8శాతం. ఇక వెలమల జనాభా 1,43,279 మంది. వారు ఓసీల్లో 2.56 శాతం, మొత్తం జనాభాలో 0.4శాతం ఉన్నారు. ఓసీల్లో శాతం పరంగా రెడ్లు అగ్రస్థానంలో ఉంటే... అగ్రవర్ణ ముస్లింలు రెండో, వైశ్యులు మూడో స్థానంలో ఉన్నారు. కమ్మ, బ్రాహ్మణ, కాపు/నాయుడు, వెలమ, రాజులు, అయ్యంగార్‌, జైనులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఓసీల్లో పట్నాయకులు, సిక్కులు, లింగాయత్‌, బౌద్ధులు, కరణం కులస్తులు కేవలం ఒకశాతం కంటే తక్కువ జనాభాతో ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఓసీలకు 19,04,884 ఇళ్లు ఉన్నట్టు సర్కారు తెలిపింది. మొత్తం ఇళ్ల సంఖ్యలో ఇది 16.98 శాతమని వెల్లడించింది. మరోవైపు తమది ఏ కులమో చెప్పని జనాభా తెలంగాణలో 12.04 లక్షల మంది ఉన్నట్టు తెలిపింది.

Updated Date - Apr 16 , 2026 | 04:41 AM