రూ.13 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:37 AM
ఉద్యోగుల ఓపిక, సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని, ప్రభుత్వం బకాయిపడిన రూ.13 వేల కోట్లను వెంటనే చెల్లించాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఓపికను ప్రభుత్వం పరీక్షించొద్దు
17న నల్లబ్యాడ్జీలతో నిరసన: టీఎన్జీవో
సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఓపిక, సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని, ప్రభుత్వం బకాయిపడిన రూ.13 వేల కోట్లను వెంటనే చెల్లించాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్ భవన్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలనడం గొంతెమ్మ కోరికలు కావన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తే వారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉంటాయని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై చర్చలు జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం చూపలేదని చెప్పారు. పీఆర్‌సీ కమిటీ ఏర్పడి 34 నెలలైనా ఇప్పటికీ నివేదిక ఇవ్వకపోవడం, మరో పీఆర్‌సీ గడువు సమీపిస్తున్నా గత పీఆర్‌సీ అమలు జరగకపోవడం బాధాకరమన్నారు. బకాయిలు ఇవ్వని గత పాలకులను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపడతామని, మే 5న ఒక రోజు రిలే నిరాహార దీక్ష చే స్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే మరో ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ, పెన్షనర్ల బకాయిలపై ప్రభుత్వ పెద్దలతో జగ్గారెడ్డి మాట్లాడాలని ప్రధాన కార్యదర్శి ముజీబ్ కోరారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్, కోశాధికారి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.