Share News

హైదరాబాద్‌లో బాణసంచా అనుమతులపై ఏసీబీ దాడులు.. రూ.30 వేల నగదు స్వాధీనం

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:33 PM

దీపావళి బాణసంచా దుకాణాల అనుమతుల కోసం అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఉప్పల్ భగాయత్‌లోని ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్‌లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సిబ్బంది వద్ద రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 90 మందితో జరిగిన ఆన్‌లైన్ లావాదేవీలపై విచారణ చేపట్టింది.

హైదరాబాద్‌లో బాణసంచా అనుమతులపై ఏసీబీ దాడులు.. రూ.30 వేల నగదు స్వాధీనం

హైదరాబాద్‌, నవంబర్ 06 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో బాణసంచా దుకాణాల అనుమతుల వ్యవహారంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఉప్పల్‌ భగాయత్‌లోని ఎల్బీనగర్‌ ఫైర్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో ఫైర్‌ సిబ్బంది వద్ద రూ.30 వేల నగదును గుర్తించారు.


దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే విషయంలో దుకాణాల యజమానుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఏసీబీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శీనయ్య, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. తనిఖీల్లో భాగంగా ఫైర్‌ సిబ్బంది వద్దనున్న నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగైదు రోజుల్లో సుమారు 90 మందితో జరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. వారికా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఆన్‌లైన్‌ లావాదేవీల వెనుక కారణాలేంటి? అనే కోణాల్లో విచారణ చేపట్టారు అధికారులు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.


ఇవీ చదవండి:

'దీపావళి వేడుకల్లో బాధ్యత అవసరం'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కర్ణాటక బీజేపీ వినూత్న నిరసన.. ఏఐ వీడియోతో కాంగ్రెస్‌పై విమర్శలు!

Updated Date - Nov 06 , 2026 | 09:40 PM