Share News

క్రీడాకారులకు కోచ్‌లను నియమించండి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:28 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. క్రీడాకారులను మోసం చేస్తున్నారంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

క్రీడాకారులకు కోచ్‌లను నియమించండి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు
Former Minister Harish Rao

హైదరాబాద్, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. క్రీడాకారులను మోసం చేస్తున్నారంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతోందన్నారు. కోచ్‌లు లేకుండా క్రీడాకారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారని ప్రశ్నించారు. ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్‌లను నియమించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.


హరీశ్ రావు పోస్టు..

‘క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే.. చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్‌లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే రేవంత్.. క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేశారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతోంది. మీ ఫుట్‌బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం రూ.వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప.. క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి.. క్రీడాకారులకు కోచ్‌లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా? పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? కోచ్‌లు లేకుండా క్రీడాకారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్‌లను నియమించండి’ అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.


‘గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయండి. మాటలు కాదు.. చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టీఏ/డీఏ ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి. క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి. మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు.. వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించడం. క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అప్రమత్తం.. అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి ఆదేశాలు

సిద్దిపేటలో సీఎం రేవంత్‌కు వినూత్న స్వాగతం.. ఆగిపోయిన పనులపై ఫ్లెక్సీలతో నిరసన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 10:58 AM