Share News

అక్వాన్ తుపాను.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:05 AM

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. మందగమనంగా అక్వాన్ గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు తెలిపారు.

అక్వాన్ తుపాను.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు
Home Minister Anitha

అమరావతి, నవంబర్ 18: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. మందగమనంగా అక్వాన్ గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు తెలిపారు. ఎల్లుండి (నవంబర్ 20) మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని.. తీరం దాటే సమయంలో 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 48 గంటలపాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనిత తెలిపారు. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షాలు, ఈదురుగాలుల దృష్ట్యా రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలి, వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.


అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని హోంమంత్రి తెలిపారు. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీటి నిల్వ, ఇతర సమస్యలపై మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు 24/7 పని చేయాలని ఆదేశించారు. ప్రజలు ఏ అవసరం ఉన్నా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల వద్దకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఆసియాన్‌కు నవశకం

అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అలర్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 10:14 AM