ఆసియాన్‌కు నవశకం
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:15 AM
ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరినీ కలుపుకొని పోయేలా అభివృద్ధి చెందాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
భారత్-ఆసియాన్ బలోపేతానికి తొమ్మిది సూత్రాల ప్రణాళికసహకారంతోనే ఇండో-పసిఫిక్ ప్రాంతభవిష్యత్తు
ఆసియాన్ దేశాల పర్యాటకులకు ఫ్రీగా ఈ-వీసాలు
సముద్ర రవాణా సహకారం, అనుసంధానంపై దీర్ఘకాలిక ప్రణాళిక
ఖనిజాలు, అణు ఇంధన రంగాల్లో భాగస్వామ్యం
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఆసియాన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
మనీలాలోనే ‘క్వాడ్’, ‘తూర్పు ఆసియా’ సదస్సులు
విశ్వసనీయ భాగస్వామ్యానికి ప్రతీక క్వాడ్: మోదీ
ప్రధాని మోదీ గట్టి పిండం.. ట్రంప్ అభినందన
తొలిసారిగా నాలుగు దేశాల నేవీ, గస్తీ విమానాలతో..
క్వాడ్ ప్రకటన.. చైనాకు పరోక్ష హెచ్చరికలు!
మనీలా, నవంబర్ 17: ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరినీ కలుపుకొని పోయేలా అభివృద్ధి చెందాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంత భవిష్యత్తు పోటీతత్వంపై కాకుండా పరస్పర సహకారంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. భారత్-ఆసియాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తొమ్మిది సూత్రాల ప్రణాళికను మోదీ ప్రతిపాదించారు. మంగళవారం 11 ఆగ్నేయాసియా దేశాల (ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా, తైమూర్ లెస్టే) కూటమి ‘ఆసియాన్’ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘ఆసియాన్’ కూటమిలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు చర్చా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆసియాన్ ఆహ్వానం మేరకు మోదీ హాజరై ప్రసంగించారు. ఆసియాన్‌తో భారత్‌కు ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ప్రపంచ భవిష్యత్తులో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని.. భారత్, ఆసియాన్ దేశాలు సాంకేతికతల రూపకల్పనలో భాగస్వాములు కావాలని మోదీ పేర్కొన్నారు. ‘ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలు ఇరుపక్షాల ఉమ్మడి ఆకాంక్షలను సాకారం చేయడానికి దోహదపడతాయన్నారు.
భారత్-ఆసియాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు 9సూత్రాల ప్రణాళికను మోదీ ప్రతిపాదించారు. సముద్ర రవాణా అనుసంధానాన్ని పెంపొందించడంతోపాటు నావికుల భద్రతకు భరోసా కల్పించే దీర్ఘకాలిక సముద్ర ప్రణాళిక, ఆసియాన్ సభ్యదేశాల పర్యాటకులకు ఉచితంగా భారత ఈ-వీసాలు, మైనింగ్, కీలక ఖనిజాల రంగాల్లో సహకారం, ఉమ్మడి సైబర్ ఫోరెన్సిక్ శిక్షణ కార్యక్రమం, పౌర అణు ఇంధన రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ వంటివి ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. విపత్తుల గురించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ఉపగ్రహాలు, వాతావరణ సమాచారాన్ని పంచుకోవడం, అత్యవసర సమయాల్లో మానవతా సాయాన్ని వేగంగా అందించడం వంటి చర్యలు చేపట్టేందుకు ఆసియాన్ దేశాలు అంగీకరించాయి. కాగా, ఆసియాన్ సదస్సుకు హాజరైన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, థాయ్‌లాండ్ ప్రధాని అనుటిన్‌లతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. అంతకుముందు మనీలాలోని వందేళ్లనాటి ‘గురుద్వారా ఖల్సా దివాన్’ పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఆసియాన్ సదస్సుకు వచ్చిన అతిథుల కోసం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఏర్పాటు చేసిన విందులో మోదీ స్థానిక బారోంగ్ తగలోగ్ అనే సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొన్నారు.
‘విశ్వసనీయ భాగస్వామ్యం’ క్వాడ్: మోదీ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర రవాణాకు భద్రత, సరఫరా వ్యవస్థలు, నూతన సాంకేతికతలు, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో విశ్వసనీయ పరిష్కారాలను అందించేందుకు ‘క్వాడ్’ కూటమి కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత్ దృష్టిలో క్వాడ్ ఒక నిర్మాణాత్మకమైన, విశ్వసనీయ భాగస్వామ్యమని పేర్కొన్నారు. మంగళవారం ఫిలిప్పీన్స్‌లోని మనీలాలోనే జరిగిన ‘క్వాడ్’ శిఖరాగ్ర సమావేశంలో మోదీ మాట్లాడారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ప్రత్యేక కూటమి ‘క్వాడ్’. సుమారు రెండేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని తకైచి పాల్గొని మాట్లాడారు. ఈ భేటీలో మోదీ మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఐదుసార్లు సమావేశమయ్యారు. ఇది నాలుగు దేశాల రాజకీయ సంకల్పానికి, ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. ఇక భేటీలో ట్రంప్ మాట్లాడుతూ.. క్వాడ్ దేశాలు కలిసి కొత్తగా ‘క్వాడ్ ఏఐ యాక్సిలరేటర్’ను ప్రారంభించాయని చెప్పారు. అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనాలను గౌరవించే దేశాల చేతుల్లోనే కీలక సాంకేతికతల భవిష్యత్తు ఉండేలా చూడాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం: ఈఏఎస్ తీర్మానం
సముద్ర సహకారం, భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్‌తోపాటు తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్)లో భాగస్వామ్య దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడంతోపాటు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించాయి. మంగళవారం మనీలాలో జరిగిన తూర్ప ఆసియా సదస్సులో ఈ మేరకు సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, నిత్యావసరాలు, ఇంధన సరఫరాకు వీలుగా వాణిజ్య మార్గాలను నిరంతరం తెరిచి ఉంచాల్సిన అవసరాన్ని తూర్పు ఆసియా దేశాల నేతలు గుర్తుచేశారు.

మోదీ గట్టి పిండం: ట్రంప్
క్వాడ్ సదస్సు అనంతరం దేశాధినేతలు మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తన పక్కనే ఉన్న ప్రధాని మోదీని చూపిస్తూ.. ఈయన చాలా దృఢమైన వ్యక్తి అని అభివర్ణించారు. అదే సమయంలో జపాన్ ప్రధాని సనే తకైచిని ఉద్దేశించి.. ఆమె ఇంకా గట్టివారంటూ చమత్కరించారు. ‘‘ఈ నేతలతో, ఈ దేశాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ముగ్గురితో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వారు నా స్నేహితులు, అసాధారణమైనవారు. నా స్నేహితులు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభిస్తోంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..
ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..