అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అలర్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలివే
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:33 AM
అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, నవంబర్ 18: అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అదనపు సిబ్బంది కోసం తెలంగాణ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. ముందు జాగ్రత్తగా తగినంత సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తుపాను తీవ్రత వల్ల విద్యుత్ శాఖకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు చేశారు. ఆర్నబ్, మురసు తుపాను అనుభవాలను అక్వాన్ ముందు జాగ్రత్త చర్యల్లోనూ కొనసాగించాలన్నారు. విద్యుత్ స్తంభాలు కూలితే యుద్ధ ప్రాతిపదికన పునరిద్దరించాలని తెలిపారు. శాఖా పర నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి నష్టమూ వాటిల్లటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా ఆపినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ప్రజలకు సమాచారం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. ఈ సమావేశంలో మూడు డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక విద్యుత్ శాఖపై ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు సమీక్ష జరపనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest AP News And Telugu News