బీమా సొమ్ము కోసం దారుణం
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:44 AM
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే హత్యచేసి పరారయ్యాడు.
తల్లిని చంపిన కొడుకు, అనంతలో ఘటన
గుంతకల్లు టౌన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వృద్ధురాలిని ఆమె కన్నకొడుకే హత్యచేసి పరారయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు, పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో ఉంటున్న ఆకుతోట సుంకులమ్మ(76)కు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త చాలా కాలం కిందటే మృతి చెందారు. పెద్ద కుమారుడు నగేష్ నెలన్నర కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రెండో కుమారుడు ఆదెప్ప బేల్దారి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నగేష్ మరణానంతరం అతని పేరిట ఉన్న రూ.లక్ష బీమా సొమ్ము తల్లి సుంకులమ్మకు రావాల్సి ఉంది.
ఆ డబ్బులు తనకు ఇవ్వాలని ఆదెప్ప తల్లిని కోరేవాడు. దీంతోపాటు ఆమె పేరిట ఉన్న ఇంటిని తన పేరిట రాయాలని ఒత్తిడి చేశాడు. దీనికి సుంకులమ్మ అంగీకరించలేదు. కూతుళ్లకు పసుపుకుంకుమ కింద కొంత సొమ్ము ఇస్తానని చెప్పడంతో ఆదెప్ప మద్యం సేవించి వచ్చి తల్లి తో గొడవపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న తల్లిని మంగళవారం వేకువజామున చీరతో గొంతు బిగించి హత్యచేసి పరారయ్యాడు. సుంకలమ్మ పెద్ద కూతురు చెన్నమ్మ తల్లికి ఉదయాన్నే టీ తీసుకుని వెళ్లారు. నేలపై అచేతనంగా పడి ఉన్న తల్లిని చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెన్నమ్మ ఫిర్యాదు మేరకు ఆదెప్పపై హత్య కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు