పరీక్షల పరేషాన్
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:43 AM
తరగతులు సక్రమంగా సాగకున్నా షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధం కావడం సమంజసం కాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తరగతులు సక్రమంగా జరగకపోయినా షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు సిద్ధం కావడంపై ఏయూ విద్యార్థుల ఆందోళన
తుఫాన్లు, స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు, సదస్సులతో ఇటీవల వర్సిటీకి తరచుగా సెలవులు
బోధన సరిగా సాగలేదంటున్న విద్యార్థులు
తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలంటూ విన్నపం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తరగతులు సక్రమంగా సాగకున్నా షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధం కావడం సమంజసం కాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల పలు కారణాలతో తరచుగా సెలవులు ఇచ్చారు. దీనివల్ల రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తుఫాన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సదస్సులు వంటి వాటి కారణంగా సుమారు నెల రోజులపాటు తరగతులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
అనేక ఇబ్బందులు
సెలవులు సమయంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే, పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ తరగతులు జరగలేదన్న వాదన విద్యార్థుల నుంచి వినిపిస్తోంది. సిలబస్ పూర్తికాకుండా మిడ్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పేర్కొంటున్నారు. ఇకపోతే, అనేక విభాగాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీ కూడా సెమిస్టర్ మధ్యలోనే వెళ్లిపోయారని, ఇది కీలక సబ్జెక్టుల బోధనపై ప్రభావం చూపిందని, కొన్ని విభాగాల్లో అయితే స్కాలర్లతోనే ఈ వ్యవహారం పూర్తి చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు పరీక్షల నిర్వ హణకు సిద్ధం కావడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ అధికారుల వాదన
ముందుగా నిర్ణయించిన ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నట్టు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంకటసుబ్బయ్య తెలి పారు. తుఫాన్లు, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు కారణంగా కొన్నిరోజులు ప్రత్యక్ష తర గతుల నిర్వహణ సాధ్యం కాలేదని, దీనికి ప్రత్యామ్నాయంగా జాతీయ విద్యా విధానంలో సూచించిన విధంగా బ్లెండెడ్ మోడ్‌ను అనుసరించి ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించినట్టు తెలిపారు.ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మొదటిరోజు నుంచి ఒక నూతన విధానం అమలు చేసినట్టు వెల్లడించారు. ఒక సబ్జెక్టును వారంలో నాలుగు పీరియడ్స్‌లో బోధించాల్సి ఉన్నప్పటికీ తాము ఐదు పీరియడ్స్ బోధించేలా ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తున్నామన్నారు. ఆ విధంగా సిలబస్‌ను సకాలంలో పూర్తిచేసే విధంగా కృషిచేసినట్టు వివరించారు. మిడ్ పరీక్షల విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సెలవుల కారణంగా కొన్నిరోజులు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేకపోయారని, దానిని భర్తీ చేసేందుకు నవంబరు, డిసెంబరు నెలల్లో రెండో శనివారాలు పనిచేయడంతోపాటు సంక్రాంతి సెలవులను తగ్గించుకుంటూ సిలబస్ పూర్తిచేసేలా అదనంగా 13 రోజులు పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రణాళికను విభాగాల్లో అమలు చేస్తున్నామన్నారు. బోధనలో రాజీ పడకుండా, ఇబ్బందులు లేకుండా విశ్వవిద్యాలయం పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.