తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 09:32 AM
తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.
హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి.
ఈ 30 శాతం కమీషన్లు, 50:50 అగ్రిమెంట్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు? విచారణలో నిగ్గు తేల్చాలి.
ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు. ఎందుకు తొలగించారు? మధ్యవర్తుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీలపై తక్షణమే నిజాలు తేల్చాలి.
దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) కింద క్రమబద్ధీకరించిన ఆస్తులను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న భూములను మళ్లీ 22A లో పెట్టి స్తంభింపజేయడం దుర్మార్గం.
జిల్లాల వారీగా 22A జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.. ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశంతో తీసేశారో ప్రజలకు పారదర్శకంగా తెలియాలి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన భూమాత.. భూ రికార్డులకు స్పష్టతనివ్వాలి కానీ, ప్రజల ఇళ్లను లాక్కునే రాబందులా మారకూడదు.
ఒక అవినీతి మంత్రిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెడుతోంది.. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఈ ఆరోపణలు అబద్ధమైతే.. వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి.. లేదంటే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అంటూ లేఖలో హరీశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. ఏపీ హైకోర్టుకు పోలీసుల నివేదిక..
Read Latest Telangana News And Telugu News