చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:25 AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. ఈ మేరకు ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను ఆమోదించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
అలాగే, శాసనసభలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేయనుంది. అందులో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనుండగా.. ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును సభ ముందుకు మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకురానున్నారు. మరోవైపు, ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, వేగేశన నరేంద్రవర్మ రాజు ప్రవేశపెట్టనున్నారు. సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా, ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు నేడు శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, భీమవరంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధుల మంజూరు, తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపైనా మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
మండలిలో కీలక ప్రశ్నలు..
శాసనమండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం, కస్టడీ మరణాలు, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, 1/70 చట్టానికి సవరణ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఆయా ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
మాజీ సభ్యులకు సంతాపం..
ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులు నాదెండ్ల భాస్కరరావు, ముద్రగడ పద్మనాభం, టి.చిన్నరాజన్, హనుమంతరాయ చౌదరి, ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, సుక్క పగడాలమ్మ, గాదె వెంకటరెడ్డి, జీఎస్ రావులకు శాసనసభ సంతాపం తెలపనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఉత్తర కెన్యాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి..
కష్టాలు తొలగిపోతాయని.. మళ్లీ పెళ్లి!