బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి..
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:58 AM
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం అప్పనపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది. భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.
దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్య భాగ్య, కుమారుడు నియాన్ష్, కుమార్తె శాన్విక నిన్న సాయంత్రం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేశారు. అప్పనపల్లి శివారులో రాజు కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని పరిశీలించగా కారు ప్రమాదానికి గురై కనిపించింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టి బావిలో నుంచి కారును బయటకు తీశారు.
కారులో రాజు, భాగ్య దంపతులు వారి ఇద్దరు పిల్లలు నియాన్ష్, శాన్విక విగతజీవులుగా పడి ఉండటంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారాన్ని బాధిత కుటుంబానికి చేరవేశారు. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో అప్పనపల్లి, బలవంతపూర్ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారింది
బెట్టింగ్ యాప్ కేసులో నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ