భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:54 AM
వేతనసవరణ చేపట్టాలని, యాదాద్రిలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లు వెనక్కితీసుకోవాలంటూ దాదాపు 14 డిమాండ్లతో...
మహాధర్నాతో విద్యుత్‌సౌధ దిగ్బంధం
వేతన సవరణ చేపట్టాలి..యాదాద్రిలో ప్రైవేటీకరణ నిలిపివేయాలి
లేనిపక్షంలో 27 నుంచి తీవ్ర కార్యాచరణ
తెలంగాణ పవర్ జేఏసీ అల్టిమేటం
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వేతనసవరణ చేపట్టాలని, యాదాద్రిలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లు వెనక్కితీసుకోవాలంటూ దాదాపు 14 డిమాండ్లతో... తెలంగాణ పవర్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలనుంచి ఉద్యోగులు, ఆర్టిజన్లు తరలివచ్చి విద్యుత్‌సౌధను దిగ్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యాదాద్రిలో టెండర్లు వెన క్కి తీసుకుంటామని ప్రకటించేదాకా విద్యుత్‌సౌధను వీడరాదని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ఉద్యోగులు పట్టుబట్టడంతో పరిస్థితి మరింత దిగజారింది. విద్యుత్‌సౌధలో మహాధర్నాకు అనుమతించ రాదని, ఉద్యోగులు పాల్గొంటే చర్యలు తప్పవని జెన్‌కో యాజమాన్యం చేసిన హెచ్చరికలను ఖాతరు చెయ్యకపోవడం గమనార్హం. ఆ తర్వాత జేఏసీ ప్రతినిధులు నచ్చచెప్పడంతో ఉద్యోగులంతా ధర్నా అనంతరం వెనుదిరిగారు. కాగా 14 డిమాండ్లపై యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఈనెల 27 నుంచి తదుపరి కార్యాచరణ ఉంటుందని జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, జనరల్ సెక్రటరీ శ్రీధర్, వజీర్, మహేష్ మాట్లాడుతూ తమ డిమాండ్లు న్యాయమైనవని, పెరుగుతున్న జీవనవ్యయం, ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, విద్యుత్‌రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులతో వేతనసవరణ అవసరమని అన్నారు. 2026 వేతన సవరణ కోసం నెగోషియేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్‌పీ)ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రైవేటీకరణను వెనక్కితీసుకోవాలని, వెంటనే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ఖరారు చేస్తే మెరుపు సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు.