Share News

కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారింది

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:52 AM

కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారిపోయిందని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని..

కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారింది

  • ప్రత్యర్థుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం

  • ‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

  • పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్య

  • కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయం

నిజామాబాద్‌/హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారిపోయిందని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని.. చిన్న చిన్న కారణాలతో ఓట్లను తొలగించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పెడుతున్న నిబంధనలతో చదువురానివారు, పేదవారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌)ను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ‘సర్‌’ రెండో దశకు సంబంధించి కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా బీఎల్‌ఏల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఇతర ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇదివరకు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను వాడుకుని ఒత్తిడి తెచ్చేదని.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘాన్ని జేబులో పెట్టుకుని ప్రత్యర్థుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘సర్‌’ ప్రక్రియలో సహాయం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 35వేల బీఎల్‌ఏల జాబితాను ఇస్తే.. ఎన్నికల సంఘం పోర్టల్‌లో 13 వేల మందిని మాత్రమే చూపడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. బీఎల్‌ఏల సమావేశం బయట బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఇటీవల పోచారం శ్రీనివా్‌సరెడ్డి చేసిన వాఖ్యలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితి తనకు తెలుసని, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని మహేశ్‌గౌడ్‌ కార్యకర్తలకు సర్దిచెప్పారు.


కొత్త ఓటర్ల నమోదుకు సమన్వయంతో ముందుకెళ్లాలి

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫారమ్‌-6 పూర్తిచేయడం)ను ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ బుధవారం సర్క్యులర్‌ జారీ చేశారు. ‘సర్‌’ రెండోదశలో భాగంగా ఈ నెల 20న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు తమ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. కాగా, దేశంలో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, యువతను దేశ నిర్ణయాత్మక శక్తిగా మార్చిన మహోన్నత నాయకుడు రాజీవ్‌గాంధీ అని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 05:53 AM