'నగరం నడిబొడ్డున కాంగ్రెస్ భారీ భూ కుంభకోణం'.. సీఎం రేవంత్‌కు హరీశ్ లేఖ
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:41 PM
కాంగ్రెస్ సర్కార్ వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తాము పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 30: నగరం నడిబొడ్డున మరో భారీ భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ రూ.87 కోట్లకే ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం పాలకులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.
‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది. రూ.500 కోట్ల విలువ చేసే ఆయిల్‌ఫెడ్ భూములను కేవలం రూ.87 కోట్లకు ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమైంది’ అని హరీశ్ లేఖలో రాసుకొచ్చారు. ఆ సొమ్మును చెల్లించేందుకు ఆయిల్‌ఫెడ్ సిద్ధంగానే ఉందని, అయినా వారిని కాదని ప్రైవేటు వ్యక్తులకై భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠాణీల్లా వేల కోట్ల రూపాయల భూములు పంచుతోందని ఘాటు విమర్శలు చేశారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు.
ఒకవైపు సామాన్యుల ఇళ్లను 22A జాబితాలో పెట్టి వేధిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఫైరయ్యారు. ఇలా స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి శ్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదని మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దుచేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీశ్‌రావు సూచించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మహా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చదవండి:
తెలంగాణలో గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ
జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు.. ఓటు వేసిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ