Share News

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరుద్ధరణ.. అభివృద్ధికి ముందు 'స్ట్రక్చరల్ ఆడిట్' అత్యవసరం!

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:06 AM

గచ్చిబౌలిలోని జీఎంసీ. బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం.

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరుద్ధరణ.. అభివృద్ధికి ముందు 'స్ట్రక్చరల్ ఆడిట్' అత్యవసరం!
Gachibowli Stadium Redevelopment

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని జీఎంసీ.బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూడటం అత్యవసరమంటూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.


2002లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ స్టేడియంను నిర్మించారు. ఆ కాలంలోనే దీనిని అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రమాణాలతో, రిక్టర్ స్కేల్‌పై 8 నుంచి 10 తీవ్రత ఉన్న భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించినట్లు ప్రచారం జరిగింది. మరి 24 ఏళ్ల తర్వాత, ఈ నిర్మాణం ఇప్పటికీ అదే పటిష్ఠతతో ఉందా? అనేది ఇప్పుడు తేల్చిన తర్వాత ముందుకెళ్తే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


700 కోట్లు అనేది సామాన్యమైన మొత్తం కాదు. ఈ నిధులను ఖర్చు చేసే ముందు CBRI (Central Building Research Institute) రూర్కీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒక స్వతంత్ర ఆడిట్ నిర్వహించడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆడిట్‌లో స్టేడియం పునాదులు, నిర్మాణం పటిష్టంగా ఉన్నాయని తేలితే, ఆధునీకరణ పేరుతో చేసే వందల కోట్ల అనవసర ఖర్చు తప్పుతుంది. ఇదే విధమైన పారదర్శకత, జవాబుదారీ తనాన్ని 100 ఎకరాల్లో నిర్మిస్తున్న కొత్త తెలంగాణ హైకోర్టు కాంప్లెక్స్ వంటి ఇతర భారీ ప్రాజెక్టుల విషయంలోనూ పాటించాలి. ప్రజాధనాన్ని అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఆ నిధులను గ్రామీణ స్థాయి క్రీడాకారుల గుర్తింపునకు, కొత్త అకాడమీల నిర్మాణానికి మరియు భవిష్యత్తు ఒలింపియన్లను తీర్చిదిద్దడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ నిర్మాణంలో లోపాలు లేదా పటిష్ఠత లోపించినట్లు తెలిస్తే, అప్పట్లో ఆ పనులు చేపట్టిన సంస్థలపై జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవీ చదవండి:

ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

Updated Date - Apr 10 , 2026 | 12:58 PM