'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:10 AM
అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: నేడు అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం(International Day of Conscience). ప్రేమ, కరుణ, నైతికతతో కూడిన శాంతియుత సంస్కృతిని ప్రోత్సహించడం, అంతర్గత మనస్సాక్షిని అనుసరించి సన్మార్గంలో నడిచేందుకు ప్రతీకగా ఏటా ఈ రోజును నిర్వహించుకుంటారు. 2019లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఈ దినోత్సవాన్ని గుర్తించింది. వ్యక్తిగత నైతికత, సామాజిక బాధ్యత, సానుభూతిని పెంపొందించడం ద్వారా మరింత సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మించడమే దీని ప్రాధాన్యం. గతేడాది 'లీవ్ నో వన్ బిహైండ్' అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మానవత్వానికి, శాంతికి నిదర్శనంగా ఉండాల్సిన నేటి రోజున.. పశ్చిమాసియా దేశాలు ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్నాయి. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇరాన్‌పై దాడులను యుద్ధ నేరాలుగా పరిగణిస్తూ సుమారు వంద మందికిపైగా అమెరికా న్యాయ నిపుణులు ఖండించారు. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రవర్తిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖపై సంతకాలు చేశారు. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్ సహా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు. 'సాయుధ దాడికి వ్యతిరేకంగా ఆత్మరక్షణలో భాగంగా లేదా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనల మేరకు మరో దేశంపై బలప్రయోగం చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే.. భద్రతా మండలి నుంచి ఈ దాడికి అనుమతి లేదు' అని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఈ దాడులతో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఇళ్లపై సమ్మెల ప్రభావం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇరాన్‌పై 'కేవలం సరదా కోసం' దాడులు చేయవచ్చని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యనూ ప్రస్తావించారు. ఈ లేఖను యేల్ లా స్కూల్‌కు చెందిన ఊనా హాతవే, హెరాల్డ్ కో, ఎన్‌వైయూకు చెందిన ఫిలిప్ ఆల్స్టన్, హ్యూమన్ రైట్స్ వాచ్ మాజీ అధిపతి కెన్నెత్ రోత్ వంటి ప్రముఖులు సంయుక్తంగా రాశారు. ప్రపంచ నాయకులుగా తమను తాము చెప్పుకునే దేశాలతో సహా అందరికీ అంతర్జాతీయ చట్టాన్ని సమానంగా వర్తింపజేసే ప్రాముఖ్యాన్నీ వారు నొక్కిచెప్పారు.
ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని అంతర్జాతీయ చట్టాల నిపుణురాలు జెనీవా దిల్ దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. ఐసీసీ తీర్పులు అమలవ్వకపోయినా దీనికి అపారమైన బాధ్యత ఉందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలను ప్రచ్ఛన్న యుద్ధంతో పోల్చలేమని, నేడు ప్రపంచం అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఆణె అన్నారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందన్నారు. అగ్రరాజ్యాలు వీటో అధికారాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనల్ని పక్కనపెట్టి యూఎన్ చార్టర్ చట్టాన్ని ఉల్లంఘించి ఇరాన్‌పై బలప్రయోగం చేస్తోందన్నారు. ఇది ఐరాసలోని భద్రతా మండలి ఆమోదంలేని ఈ యుద్ధం దురాక్రమణ కిందికే వస్తున్నారు.
ఈ విషయమై.. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్ స్పందిస్తూ.. ప్రస్తుతమున్న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి సూత్రాలను అనుసరించి ఇరాన్‌పై అమెరికా తీరును తప్పుబట్టారు.
ఇదే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 'ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా అక్రమ దాడులను ఖండిస్తూ 104 దేశాలు తీర్మానం చేశాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ విధంగా భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్నట్టు కనిపించడం, మిగిలిన దేశాల విషయంలో భారత్ ఒంటరైపోతున్న భావన కనిపిస్తోంది' అని వివరించారు.
ఇవీ చదవండి:
ట్రంప్ వద్ద కంటే.. మా వద్దే భద్రం
అమెరికాలో ఇరాన్ నేతల బంధువుల అరెస్టు