Share News

హైదరాబాద్‌లో విదేశీ ఓటర్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:55 AM

హైదరాబాద్‌ జిల్లాలో కొందరు విదేశీయులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)లో ప్రాథమికంగా గుర్తించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

హైదరాబాద్‌లో విదేశీ ఓటర్లు
Hyderabad Voter List

  • సనత్‌నగర్‌లో 12 మంది నేపాలీలు

  • రంగారెడ్డిలోని ఓ సెగ్మెంట్‌లో

  • పదుల సంఖ్యలో రోహింగ్యాలు

  • బీఎల్‌ఓల నోటీసులకు ఆధారాలివ్వని విదేశీయులు

  • విదేశీ ఓట్ల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధం

  • క్షేత్రస్థాయి తనిఖీలకు బీఎల్‌ఓలను అనుమతించండి

  • వివిధ కమ్యూనిటీలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లాలో కొందరు విదేశీయులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)లో ప్రాథమికంగా గుర్తించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. సనత్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 12 మంది నేపాలీలు, రంగారెడ్డి జిల్లాలోని మరో అసెంబ్లీ స్థానం పరిధిలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు అక్రమంగా ఓటుహక్కు పొందినట్లు తెలుస్తోంది. సర్‌ ప్రక్రియ చేపట్టిన బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)లు జారీ చేసిన నోటీసులకు ఆధారాలుగా ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించక పోవడంతో వారు తమ పేరు ఓటరుగా అక్రమంగా నమోదు చేసుకున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు సూత్రప్రాయంగా అంచనాకొచ్చారు. వీసా అవసరం లేకున్నా.. సక్రమంగానే హైదరాబాద్‌కొచ్చిన నేపాలీలకు భారత పౌరసత్వం లేదని తేల్చేశారు. వారితోపాటు రోహింగ్యాల ఓట్ల రద్దుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.


హైదరాబాద్‌లో ఎనామలిస్‌, నో మ్యాపింగ్‌ జాబితాలోని 12.54 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తే.. వారిలో 94శాతానికి పైగా ఓటర్లు తమకందుబాటులో ఉన్న ఆధారాలు సమర్పించారని అధికార వర్గాల కథనం. దాదాపు 6,000 మందికి నోటీసులు జారీ చేసి 45 రోజులు దాటినా.. వారు ఎటువంటి ఆధారాలూ సమర్పించలేదు. విచారణ గడువు ముగిసిన నేపథ్యంలో నోటీసులకు స్పందించని వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉంటే, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లను అనుమతించాలని కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, నివాస సంక్షేమ సంఘాల (ఆర్‌డబ్లూఏ)కు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ విజ్ఞప్తి చేశారు. అందుకు సహకరించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు నమోదు నేపథ్యంలో మంగళవారం తన కార్యాలయంలో ఆయన వారితో సమావేశమయ్యారు. అర్హుడైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా సహకరించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:55 AM