Share News

కల్తీ కల్లు విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:52 PM

మెదక్ జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. హవేలీ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లి, వాడి గ్రామాల్లో బుధవారం ఏకకాలంలో తనిఖీలు చేశారు.

కల్తీ కల్లు విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Medak Toddy Scam

మెదక్ జిల్లా, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. హవేలీ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లి, వాడి గ్రామాల్లో ఈరోజు (బుధవారం) ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈగల్ ఫోర్స్, ఆర్ఎన్సీసీ సంగారెడ్డి బృందం, మెదక్ రూరల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఐదు కల్లు దుకాణాలు, ఓ కల్లు డిపోపై ఏకకాలంలో సోదాలు చేశారు. కల్తీ కల్లు తాగిన ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించారు. అందరిలోనూ బెంజోడియాజిపైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపినట్లు ఈగల్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. కల్తీ కల్లు విక్రయాల వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో 180 అక్రమ కల్లు బాటిళ్లు (15 బాక్సులు), నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హవేలీ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశారు.


అరెస్ట్ అయిన వారిలో బుచ్చమొల్ల వీరేశం గౌడ్, కలాలి కిషన్ గౌడ్, కొత్తపల్లి నర గౌడ్, కొత్తపల్లి లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు. పదమటి శ్రీనివాస్ గౌడ్, కొండ శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉన్నారు. కల్తీ కల్లు తాగిన ఎనిమిది మందికి కౌన్సెలింగ్ నిర్వహించి.. డీఅడిక్షన్ కేంద్రాలకు తరలించారు. మత్తు పదార్థాల కల్తీ, సరఫరా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 07:15 PM