Share News

ప్రియాంక సూచనతో తెలంగాణకు..

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:51 AM

యూపీలోని గోరఖ్‌పూర్‌ బీడీఆర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 60మందికిపైగా పిల్లలు చనిపోయిన ఘటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌.

ప్రియాంక సూచనతో తెలంగాణకు..
Dr Kafeel Khan

  • ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయత చూపుతున్నారు.. వారికి కృతజ్ఞతలు

  • పుట్టి పెరిగిన యూపీలో ఉండలేని పరిస్థితులు

  • పిల్లల వైద్యుడినైన నాపై నేరస్థుడిగా ముద్ర వేశారు

  • 500 రోజులు జైలులో గడిపాను

  • ‘హిస్టరీ-షీటర్‌’ పుస్తకావిష్కరణ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’తో డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): యూపీలోని గోరఖ్‌పూర్‌ బీడీఆర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 60మందికిపైగా పిల్లలు చనిపోయిన ఘటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌. వైద్యుడిని దేవుడికి ప్రతీకగా భావించే భారతీయ సమాజంలో ఆయన సొంతూరు వదిలి ఎందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది? ఏకంగా 500రోజులు జైలు శిక్ష అనుభవించడానికి కారణాలేమిటి? జైలులో తనకు ఎదురైన అనుభవాలేమిటి? వీటన్నింటికీ అక్షరరూపమే ‘ది హిస్టరీ-షీటర్‌’ (నేరచరిత్ర కలిగిన వ్యక్తి). ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌ వేదికగా జరిగిన నేపథ్యంలో డాక్టర్‌ కఫీల్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది.


‘ది హిస్టరీ-షీటర్‌’ పుస్తక నేపథ్యం ఏమిటి?

‘గోరఖ్‌పూర్‌ ఆస్పత్రి విషాదం’ పుస్తకానికి సీక్వెల్‌ ఇది. ఓ వైద్యుడి కథ కంటే కూడా ఒక సాధారణ పౌరుడు.. అధికారాన్ని సవాల్‌ చేసినప్పుడు అతనికి ఎదురయ్యే అనుభవాలను కళ్లకు కడుతుంది. నేను చేయని నేరాన్ని నా మీద మోపి అరెస్టు చేశారు. నాపై కట్టుకథలు అల్లి ప్రచారంలో పెట్టారు. పోలీసు ల హింస, జైల్లో నిద్రాహారాలు, తిండితిప్పలు లేకుం డా గడిపిన రోజులు. నా కుటుంబం అనుభవించిన మానసిక క్షోభ తదితర వివరాలతో పాటు సమకాలీన దేశ పరిస్థితులను ఈ పుస్తకంలో పేర్కొన్నాను.


గోరఖ్‌పూర్‌ ఘటన మీ జీవితంపై ప్రభావం?

2017 ఆగస్టుకు ముందు నేను బీడీఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నా. చిన్నారులకు వైద్యసేవలు అందించడం ద్వారా నా భవిష్యత్తును నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టిన నన్ను నేరచరిత్రకలిగిన వ్యక్తిగా చిత్రీకరించారు. అది నా వృత్తిపరమైన గుర్తింపునకు సవాలుగా మారింది. నిర్లక్ష్యం, అవినీతి వంటి దుర్మార్గపు నేరారోపణలను మోస్తూ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. సత్యాన్ని ఎలుగెత్తి చాటడంకోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. నేను పుట్టి పెరిగిన గోరఖ్‌పూర్‌లో మనుగడ సాగించలేని పరిస్థితి ఎదురైంది. అయినా వెనక్కి తగ్గలేదు. న్యాయపోరాటానికి దిగాను. ‘డాక్టర్‌ ఆన్‌ రోడ్స్‌’ పేరుతో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించా. రచయితగా మారాను.


మీ జైలు జీవితం గురించి...

మూడు దఫాలుగా మొత్తం 500రోజులు జైల్లో గడిపాను. మొదట ఆస్పత్రి దుర్ఘటనకు నన్ను బాఽధ్యుడిని చేస్తూ అరెస్టు చేశారు. తరువాత సీఏఏ-ఎన్నార్సీకి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా, మూ డవసారి జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించా రు. అప్పుడు నన్ను రోజూ పోలీసులు చిత్రహింసలు పెట్టేవారు. దుస్తులు తీయించి మరీ నన్ను లాఠీతో తీవ్రంగా కొట్టారు. ‘జవాన్‌’ సినిమా విడుదలైనప్పుడు (గోరఖ్‌పూర్‌ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సినిమా) ఆ సినిమా బృందాన్ని అభినందించినందుకుగాను కొత్త కేసు నామీద బనాయించారు.


హైదరాబాద్‌లో స్థిరపడడానికి కారణం?

గోరఖ్‌పూర్‌లో మనుగడ సాగించలేని పరిస్థితులలో నా భార్య పిల్లలతో పాటు రాజస్థాన్‌కు వెళ్లాను. జైపూర్‌లో మాకు తగిన సహాయసహకారాలు అందించడంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ గారు చాలా సాయపడ్డారు. కొన్నాళ్ల తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ప్రియాంకా గాంధీ గారి సూచన మేరకు 2024లో హైదరాబాద్‌కు వచ్చాం. తొలుత ఇక్కడ కూడా సమస్యలు ఎదుర్కొన్నా. ఎట్టకేలకు ఒక మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది.


ఇక్కడి ప్రజలతో అనుభవాలు?

అతి తక్కువ సమయంలోనే నా భార్య, పిల్లలు ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డారు. నాకు ఊహించినదానికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు లభించాయి. ఈ నగర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎ మద ర్స్‌ గైడ్‌ టు గుడ్‌ హెల్త్‌’ పేరుతో గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణ, పిల్లల ఆరోగ్య విషయాలలో.. ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ సాయంతో వైద్యసలహాలను ఉచితంగా అందిస్తున్నాం. 84488 20700 నెంబరుకు వాట్సాప్‌ ద్వారా ఆరోగ్య సమస్యను తమ సొంత భాషలో వాయిస్‌ మెసేజ్‌ పంపించి సేవలను పొందవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:51 AM